కొనుగోళ్లు లేట్.. కల్లాల్లోనే ధాన్యం..అవస్థలు పడుతున్న అన్నదాతలు

కొనుగోళ్లు లేట్.. కల్లాల్లోనే ధాన్యం..అవస్థలు పడుతున్న అన్నదాతలు
  • అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు, మక్కలు
  • బార్దాన్లు లేక, లారీలు రాక ఆలస్యమవుతున్న కొనుగోళ్లు
  • ఇప్పటివరకు 12.38 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
  • రైతులకు రూ.1,129.43 కోట్ల చెల్లింపులు 
  • మరో వారంపాటు వర్షాలు.. అవస్థలు పడుతున్న అన్నదాతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతుండగా, మరోవైపు అకాల వర్షాలు రైతాంగాన్ని కుదిపేస్తున్నాయి. కల్లాల్లో నిల్వ చేసిన ధాన్యం రాసులు వర్షానికి తడిసి ముద్దవుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సాగులో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న రైతులు, పండించిన పంటను అమ్ముకునే దశలో ప్రకృతి, పరిపాలనా సమస్యల మధ్య నలుగుతున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పొలాల వద్ద ఆరబోసిన వడ్లు, మక్కజొన్న పంటలు వర్షానికి తడిసి నష్టపోయాయి. మరికొన్ని చోట్ల గాలిదుమారానికి, వర్షాలకు వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి.

కొనుగోళ్లకు బార్దాన్, లారీల సమస్యలు 

ఇప్పటికే కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. బార్దాన్ కొరత, లారీలు రాకపోవడం, మిల్లుల వద్ద అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడింగ్ ఆలస్యంలాంటి సమస్యలు కొనుగోళ్లకు పెద్ద అడ్డంకిగా మారాయి. కాంటాలు పెట్టిన ధాన్యం రోజులు గడిచినా సెంటర్లలోనే నిలిచిపోతోంది. లారీల్లో తరలించిన వడ్లు మిల్లుల వద్ద రోజుల తరబడి నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింటున్నది. ఇదే సమయంలో అకాల వర్షాలు కురవడంతో ధాన్యం తడిసి నాణ్యత కోల్పోయే ప్రమాదం నెలకొన్నది.  రాష్ట్రంలో సుమారు 3 వేల రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, అనేక మిల్లర్లు డిఫాల్టర్లుగా మారడం, బ్యాంక్ గ్యారంటీలు లేకపోవడం వల్ల వారికి ధాన్యం కేటాయించడం లేదు.  మరోవైపు దొడ్డు రకం వడ్లను మిల్లర్లు స్వీకరించేందుకు ముందుకు రాకపోవడం కూడా సమస్యను మరింత క్లిష్టం చేస్తోంది. దీంతో సన్న రకం ధాన్యం మాత్రమే ఎక్కువగా తీసుకుంటుండగా.. మిగిలిన ధాన్యం కేంద్రాల్లోనే నిలిచిపోతోంది.

ఇప్పటి వరకు కొన్న ధాన్యం 12.38 లక్షల టన్నులు

రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ఆశించినంత వేగంగా జరగడం లేదు. ఇప్పటివరకూ లక్ష్యంలోని 20 శాతం కూడా కొనుగోలు కాలేదని సమాచారం. మొత్తం 143 లక్షల టన్నుల దిగుబడి అంచనాల్లో ఉండగా, సుమారు 90 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌కు సంబంధించి సుమారు 12.38 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇది లక్ష్యానికి 20 శాతానికి కూడా చేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం 5.07 లక్షల టన్నులు, దొడ్డు రకం 7.31 లక్షల టన్నులు సేకరించినట్టు అధికారులు తెలిపారు. 1.54 లక్షల మంది రైతులకు రూ.1,129.43 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. రోజుకు లక్ష టన్నుల వరకు కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ, మొత్తం లక్ష్యంతో పోలిస్తే వేగం తక్కువగానే ఉంది.

మరో వారంపాటు వర్షాలు..

మరో వారంపాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. చేతికందిన పంట కూడా నష్టపోతుందేమోనన్న భయం వెంటాడుతున్నది. కల్లాల్లో ఉన్న ధాన్యం ఎప్పుడు తడుస్తుందో అన్న భయంతో రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. పరదాలు కప్పి ధాన్యాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ప్రకృతి ముందు వారు బలహీనంగా మారుతున్నారు. వర్షం పడకుండా దేవుడి మీదే ఆధారపడి ధాన్యం రాసుల వద్ద కాపలా కాస్తున్న రైతులు, ప్రతి క్షణం ఆందోళనలోనే గడుపుతున్నారు.

పలు జిల్లాల్లో నష్టం తీవ్రం

సిద్దిపేట జిల్లాలోని మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం, మక్కజొన్న పంట వడగండ్ల వానకు పూర్తిగా తడిసి పోయింది. కేవలం కొన్ని నిమిషాల వర్షంతోనే పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. మహబూబాబాద్ జిల్లాలో గాలిదుమారం కారణంగా మక్కజొన్న కంకులు కొట్టుకుపోయాయి. నల్లగొండ జిల్లాలో కూడా భారీ వర్షంతో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి రైతులకు నష్టం కలిగింది. “కష్టపడి పండించిన పంట కండ్లముందే నీటిపాలవుతోంది. కొనుగోళ్లు సకాలంలో జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు” అంటూ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యానికి సరైన పరిహారం అందించాలని వారు కోరుతున్నారు. ఒకవైపు కల్లాల్లో ధాన్యం రాసులు... మరోవైపు రైతుల కళ్లల్లో దైన్యం... పరిస్థితులు  ప్రస్తుతం రాష్ట్రంలో రైతన్నల  దుస్థితిని ప్రతిబింబిస్తోంది. 

వరి కుప్ప మీదనే కూలిన రైతు

మూడు రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్లను ఆరబోస్తున్న ఓ రైతు ఎండ వేడికి తట్టుకోలేక వరి కుప్పమీదనే ప్రాణాలు వదిలాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన రాపోలు గౌరయ్య (70) మూడు రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. తేమ శాతం అధికంగా ఉండడంతో వడ్లను అక్కడే ఆరబోశాడు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారడంతో వర్షం వస్తుందన్న భయంతో భార్య వెంకటమ్మతో కలిసి వడ్లను కుప్ప చేస్తుండగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. గౌరయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వడదెబ్బతో చనిపోయినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. - ఇబ్రహీంపట్నం, వెలుగు