చైనా సోషల్ మీడియాలో ‘ప్లాస్టిక్ డైట్’ అనే ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ డైట్ అంటే.. తినే ముందు నోటిలో ఒక సన్నని ప్లాస్టిక్ కవర్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు. కొంతసేపు నోట్లోనే ఉంచుకుని ఆ తర్వాత ఫుడ్‌తోపాటు ఆ ప్లాస్టిక్ ముక్కను బయటకు తీసేస్తారు. అంటే ఫుడ్‌ను నమిలిన అనుభూతి కలుగుతుంది. కానీ, అది కడుపులోకి వెళ్లదు. దీనివల్ల కడుపు నిండినట్లు మెదడుకు సంకేతాలు పంపి, ఫుడ్ తీసుకోకుండా బరువు తగ్గొచ్చని వాళ్లు భావిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు బరువు తగ్గినట్లు అనిపించినా, అది ఆరోగ్యకరమైన మార్పు కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ పద్ధతిలో శరీరంలోని కొవ్వు కరగదు. కేవలం ఒంట్లో నీళ్లు, మజిల్, అవసరమైన పోషకాలు మాత్రమే తగ్గిపోతాయి. పైగా మెటబాలిజం మందగించి శరీరం బలహీనపడుతుంది. తిరిగి సాధారణ ఫుడ్ తీసుకోవడం మొదలవగానే మునుపటి కంటే వేగంగా బరువు పెరుగుతారు.
కడుపు నిండినట్లు అనిపించే సతైటీ అనే అనుభూతి కేవలం నమలడం వల్ల మాత్రమే రాదు. మనం ఎంత నెమ్మదిగా తింటున్నాం.. కడుపు ఎంత వరకు సాగుతోంది.. శరీరంలోని హార్మోన్లు ఇచ్చే సంకేతాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్ ద్వారా ఆహారం నమలడం వల్ల లాలాజలంతో కలిసి హానికరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఆ ప్లాస్టిక్ పొర గొంతులో చిక్కుకుని ఊపిరి ఆడక ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.
ఈ ట్రెండ్ మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందంగా కనిపించాలనే ఒత్తిడి వల్ల ఆత్మన్యూనతభావం కలుగుతుంది. ఫుడ్ మీద ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది ఈటింగ్ డిజార్డర్స్‌కు దారితీస్తుంది. శరీరానికి తగినంత న్యూట్రిషన్స్ అందకపోవడం వల్ల చిరాకు, విచారం, అలసట, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బరువు తగ్గడం అనేది ఒక ప్రయోగంలా ఉండకూడదు. సమతుల్య ఆహారం, వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలితో అది సాధ్యమవుతుంది.
అంతేకాదు.. అక్కడి వాళ్లు అందంగా కనిపించాలని, బరువు తగ్గాలనే ఆలోచనతో మరో పద్ధతి కూడా పాటిస్తున్నారు. ప్లాస్టిక్ లేదా సింథటిక్ పాలిమర్లతో తయారైన ‘డైటరీ ఫైబర్’ పౌడర్లను అక్కడి వాళ్లు ఆహారంగా తీసుకుంటున్నారు. ఇది జీర్ణాశయంలోకి వెళ్లాక ఒక ప్లాస్టిక్ ముద్దలా తయారై, కడుపు నిండిన భ్రమను కలిగిస్తుంది. అంటే, శరీరాన్ని ఒక మెషిన్లా భావించి, దాని లోకి పనికిరాని వ్యర్థాలను పంపి ఆకలిని చంపేస్తున్నారు. దీనివల్ల బరువు తగ్గడం కాదు, శరీరంలోని జీవక్రియలను ప్లాస్టిక్‌తో నింపేస్తున్నారు.
మన బాడీ డస్ట్‌బిన్ కాదు..
మనం తిన్న ఆహారం శక్తిగా మారాలి కానీ, కడుపులో సిమెంట్‌లా పేరుకుపోకూడదు. ఈ ప్లాస్టిక్ పదార్థాలు పేగుల్లోకి చేరినప్పుడు అవి అరగకపోగా, విసర్జన ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తాయి. ఫలితంగా పేగులు ఉబ్బిపోవడం, ఇన్ఫెక్షన్లు రావడం, లోపల ప్లాస్టిక్ ముక్కలు చిక్కుకుపోయి సర్జరీ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. పోషకాలు అందక చర్మం పాలిపోవడం, జుట్టు రాలడం మాత్రమే కాదు.. దీర్ఘకాలంలో కణజాలం దెబ్బతిని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తోంది.
రాబోయే రోజుల్లో మానవ శరీరం సైబోర్గ్ (Cyborg) లాగా మారుతుందని ఊహిస్తున్న తరుణంలో, ప్రకృతి ఇచ్చిన శరీరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపడం అంటే మన వినాశనాన్ని మనం కొని తెచ్చుకోవడమే. భవిష్యత్తులో మనం తీసుకునే ఆహారాన్ని స్కాన్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, ఇలాంటి వికృత ధోరణులు మానవ డిఎన్ఏపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కృత్రిమ పద్ధతులు మనిషిని రోబోగా మార్చొచ్చు కానీ, ప్రాణం ఉన్న మనిషిగా ఉంచలేవు. మనిషి శరీర ఆరోగ్యానికి, అందానికి బ్యాలెన్స్డ్ ఫుడ్, క్రమం తప్పని వ్యాయామమే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రెండ్స్ అని ఎక్స్పర్ట్స్ గట్టిగా చెప్తున్నారు.
