సౌతాంప్టన్: యార్కర్ వేయమని ధోనీ ఇచ్చిన సలహా వల్లే హ్యాట్రిక్ సాధించానని ఇండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. మహీ చెప్పడంతో రెండో ఆలోచన చేయలేదన్నాడు. ‘నా ప్లాన్ చాలా సింపుల్. యార్కర్లు వేయాలనుకున్నా. మహీ భాయ్ కూడా అదే సలహా ఇచ్చాడు. మరో ఆలోచన చేయలేదు. వెంటనే అమలు చేశా. హ్యాట్రిక్ తీయడం చాలా అరుదుగా వచ్చే అవకాశం. కాబట్టి ఎలాంటి తప్పు చేయకుండా ముందుకెళ్లా’ అని షమీ పేర్కొన్నాడు. భువనేశ్వర్ గాయపడటంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన షమీ.. అఫ్గానిస్థాన్‌పై హ్యాట్రిక్‌తో కలిపి నాలుగు వికెట్లు తీసి ఇండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కడం చాలా అదృష్టమని షమీ అన్నాడు. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలని ముందే అనుకున్నట్లు చెప్పాడు. ‘ఆఖరి ఓవర్‌లో ఆలోచించడానికి కూడా టైమ్ లేదు. రెండో అవకాశం కూడా లేకపోవడంతో నైపుణ్యంపైనే ఆధారపడి బౌలింగ్ చేశా. ఎక్కువ వేరియేషన్స్ కోసం ప్రయత్నిస్తే రన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాట్స్‌మన్ మైండ్‌ను రీడ్ చేయకుండా.. యార్కర్లతో పని పట్టాలన్నది నా వ్యూహం. దానికే కట్టుబడ్డా. మహీ కూడా ఇదే చెప్పాడు. ఫుల్ లెంగ్త్ బంతులు వేస్తే బ్యాట్‌పైకి నేరుగా వెళ్తున్నాయి. అందుకే వాటి జోలికి పోకుండా షార్ట్ పిచ్‌లను నమ్ముకున్నాం. రకరకాల లెంగ్త్‌లతో బౌన్సర్లు కూడా సంధించాం’ అని షమీ చెప్పుకొచ్చాడు. గాయం తర్వాత తాను ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టిసారించానన్నాడు. అదే ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందన్నాడు.

