వెంటాడుతున్న ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు

వెంటాడుతున్న ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు

ఆన్ లైన్ లోన్ యాప్స్ వేధింపులు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు కేటుగాళ్ళు రాత్రి, పగలు అనే తేడా లేకుండా లోన్ కట్టాలంటూ మెసేజ్లు, కాల్స్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు పంపి లోన్ కట్టకపోతే బంధువులకు, స్నేహితులకు పంపుతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగేస్తున్నారు. తాజాగా ఈ లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఇన్ని జరుగుతున్నా లోన్ యాప్స్ నిర్వహకులపై ప్రభుత్వం చర్యలు మాత్రం కనిపించడంలేదు.

లోన్ యాప్స్ వేధింపుల బారిన పడి మనోవేదనకు గురవుతున్న ఓ యువకుడి ఉదంతం  వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. కుల్కచర్ల మండల కేంద్రంలో నివాసముంటున్న కోటేశ్వర శర్మ అనే యువకుడు ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల బారిన పడ్డాడు. యువకుడి మార్నింగ్ న్యూడ్ ఫోటో అతనికే పంపి లోన్ కట్టాలని, లేదంటే బంధువులకు, మిత్రులకు ఫొటో పంపి పరువు తీస్తామంటూ వేధింపులకు కేటుగాళ్లు గురి చేస్తున్నారు. నెల రోజుల క్రితం లోన్ అప్రూవల్ అయిందంటూ తన మొబైల్ కి మెసేజ్  వచ్చిందని యువకుడు తెలిపాడు. తను ఎలాంటి లోన్ కోసం అప్లై చేయకుండానే ఎలా అప్రూవ్ అయిందని మెసేజ్ ఓపెన్ చేసి తెలియక తన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేశాడు. ఈ క్రమంలో యువకుడి వాట్సాప్ కు  లోన్ అప్రూవల్ అయిందని.. మెసేజులు,కాల్స్ రావడం మొదలయ్యాయని తెలిపాడు. తనకు ఎలాంటి లోన్స్ అవసరం లేదని పదే పదే చెప్పినప్పటికీ 2200 రూపాయలు  అతని ఖాతాలో జమ చేశారని ఆరోపించాడు. ఆ రోజు నుండి లోన్ తిరిగి కట్టాలంటూ రాత్రి, పగలు తేడా లేకుండా మెసేజెస్  రూపంలో, కాల్స్ రూపంలో వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

దీంతో ఇక చేసేదేం లేక వెంటనే లోన్ డబ్బులు మొత్తం కట్టేశానని ఆ యువకుడు తెలిపాడు. లోన్ అమౌంట్ మొత్తం కట్టినప్పటికీ లోన్ కట్టాలంటూ వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. యువకుడు మెసేజ్ లకు, కాల్స్ కు స్పందించకపోతే యువకుడి మిత్రులకు, బంధువులకు మీ వాడు లోన్ కట్టడం లేదంటూ మెసేజ్ లు చేయడం మొదలుపెట్టారని ఆ యువకుడు చెప్పాడు. ఈ నేపథ్యంలో తన పరువు పోతుందేమో అని భావించి దాదాపు 15 వేల రూపాయలు కేటుగాళ్లకు సమర్పించుకున్నానని, అయినా వేధింపులు ఆగకపోవడంతో చేసేదేమీ లేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఆన్లైన్ లోన్ యాప్ ల వేధింపులపై ఫిర్యాదు చేశానని స్పష్టం చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వాట్సప్ డిలీట్ చేసి ఎలాంటి కాల్స్ కు మెసేజ్ లకు రెస్పాండ్ అవ్వద్దు అని సూచించారు. 

ఇంతటితో ఆగని కేటుగాళ్లు .. ఆ యువకుడు వాడుతున్న మరో వాట్సాప్ నెంబర్ కు కాల్స్, మెసేజ్ లు చేస్తూ మళ్లీ వేధింపులు మొదలుపెట్టారు. యువకుడి మార్ఫింగ్ న్యూడ్ ఫోటోలు అతనికి పంపి డబ్బులు కట్టాలని, లేకపోతే నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లకు ఈ ఫోటో పంపుతామంటూ కాంటాక్ట్ లిస్ట్ , ఫొటో పెట్టి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తెలియక ఓపెన్ చేసిన మెసేజ్ ఇంత మనోవేదనకు గురి చేస్తుందని అనుకోలేదని.. వారి వేధింపులు భరించలేక పోతున్నానని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి కేటుగాళ్ల బారినపడి వేధింపులకు తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇలాంటి లోన్ యాప్ లు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆ యువకుడు వేడుకుంటున్నాడు.