హైదరా బాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ, అక్రమాలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్‌సీఏ, సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది..
హెచ్‌సీఏలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి.. సంస్థ కార్యకలాపాల పర్యవేక్షణతో పాటు పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావును ఏకసభ్య కమిషన్‌గా నియమించారు. అలాగే, ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జిందా తిలిస్మాత్ క్రికెట్ క్లబ్, ఎస్‌ఏ అంబర్‌పేట క్రికెట్ క్లబ్, సాగర్ క్రికెట్ క్లబ్ వేర్వేరుగా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశాయి.
ఈ పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. అప్పీలుదారుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. హెచ్‌సీఏకు సంబంధించిన అన్ని ఆర్థిక, సాంకేతిక, పరిపాలనా వ్యవహారాలపై పర్యవేక్షణ కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించడం సముచితం కాదన్నారు. ఎన్నికల ద్వారా ఏర్పడిన సంస్థను పరోక్షంగా పక్కనపెట్టడం చట్టబద్ధం కాదని వాదించారు.
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కొన్ని ఆరోపణలు ఉన్నాయనే కారణంతో మొత్తం కమిటీ పనితీరును ప్రశ్నించడం సరికాదని, కొందరి చర్యల వల్ల మొత్తం సంస్థను తప్పుబట్టే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసిన డివిజన్ బెంచ్.. తదుపరి విచారణను జులై 21కు వాయిదా వేసింది.
