త్వరలో హైటెక్ సిటీలో హెచ్‌‌‌‌సీఎల్ కొత్త క్యాంపస్

 త్వరలో హైటెక్ సిటీలో హెచ్‌‌‌‌సీఎల్  కొత్త క్యాంపస్

హైదరాబాద్, వెలుగు: హైటెక్ సిటీలో హెచ్‌‌‌‌సీఎల్  త్వరలో కొత్త క్యాంపస్ ను  ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. శుక్రవారం సచివాలయంలో హెచ్‌‌‌‌సీఎల్  టెక్నాలజీస్  చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త క్యాంపస్  ప్రారంభోత్సవానికి రావాలని సీఎంను ఆయన ఆహ్వానించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరూ ప్రధానంగా చర్చించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు, విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్  ఇండియా స్కిల్  యూనివర్సిటీలో హెచ్ సీఎల్  భాగస్వామ్యం ఉండాలని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా వేల మంది యువకులకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధికి హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌‌‌‌సీఎల్  చేస్తున్న కృషిని  రేవంత్  అభినందించారు. హెచ్‌‌‌‌సీఎల్  వ్యూహాత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలను కల్పించడంతో  పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని  సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలను నేర్పించి సాధికారత కల్పించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని  రోష్ని నాడార్  హామీ ఇచ్చారు.

భద్రకాళీ నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం

హనుమకొండ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ పాలక మండలి సభ్యులు ఆహ్వానం పలికారు. శుక్రవారం హైదరాబాద్  జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేవస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ను శాలువాతో సత్కరించారు. హనుమకొండలో జరిగే భద్రకాళీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు.