హాస్పిటల్కు వెళ్తున్నానని చెప్పి.. చెరువులో శవమై తేలిండు

హాస్పిటల్కు వెళ్తున్నానని చెప్పి.. చెరువులో శవమై తేలిండు

ఘట్​కేసర్, వెలుగు: ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్​కు వెళ్తున్నానని చెప్పిన ఓ వ్యక్తి చెరువులో శవమై తేలాడు.  ఘట్​కేసర్​కు చెందిన కిషోర్ (40) కొండాపూర్ సమీపంలోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఘట్​కేసర్ లో ఉన్న తన ఇంటిని విక్రయించడంతో కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గత నాలుగేండ్లుగా కిషోర్ పనిచేస్తున్న ఆశ్రమంలోనే నివాసం ఉంటున్నాడు. 

నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్​కు వెళ్తానని ఆశ్రమం నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం ఘట్​కేసర్ సమీపంలోని చెట్టేరుకుంట చెరువులో అతని మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కిషోర్ మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.