- ఆవేదనతో ఔట్ సోర్సింగ్ ..ఎంప్లాయీకి గుండెపోటు
సిద్దిపేట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చాడంటూ అధికార పార్టీ నేత సూచనతో ఓ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారు. రెండు నెలలుగా ఎవరూ అతని గోడును పట్టించుకోకపోవడంతో ఆవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. బాధితుడి కొడుకు కెమ్మసారం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా ఐదు సంవత్సరాల క్రితం కులవృత్తి పందుల పెంపకాన్ని వదులుకున్నందుకు కెమ్మసారం కనకయ్యకు ప్రత్యామ్నాయ ఉపాధిగా మున్సిపల్ వాటర్ వర్క్స్ లో ఔట్ సోర్సింగ్ జాబ్ఇచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో కనకయ్య అన్న కొడుకు సంతోష్ కుమార్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కెమ్మసారం ప్రవీణ్ కుమార్ గెలిచాడు. తనకు వ్యతిరేకంగా పనిచేశాడని కక్ష గట్టి రెండు నెలల క్రితం కనకయ్యను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతునివ్వలేదని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటున్నా ఎవరూ అతని గోడును పట్టించుకోలేదు. ఉద్యోగం గురించి పలుసార్లు మున్సిపల్ కమిషనర్ ను కలిసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర మనోవేదనతో మంగళవారం గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ రమణాచారిని వివరణ కోరగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనే ఫిర్యాదు మేరకు ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు. ---
