హెడ్ మాస్టర్లకు పోస్టింగ్ ఇయ్యలే

హెడ్ మాస్టర్లకు పోస్టింగ్ ఇయ్యలే

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మల్టీ జోన్లు మారిన స్కూల్ హెడ్మాస్టర్లకు ఇంకా సర్కార్​ పోస్టింగ్​లు ఇవ్వలేదు. అలకేషన్ ఆర్డర్స్ ఇచ్చి 15 రోజులవుతున్నా ఇప్పటికీ జిల్లాలు కేటాయించలేదు. దీంతో హెడ్ మాస్టర్లలో అనుమానాలు మొదలయ్యాయి. అలకేషన్​ ప్రక్రియ తప్పులతడకగా ఉందని, దీంతోనే ఆలస్యం చేస్తున్నారని చెప్తున్నారు. జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 2,243 మంది హెడ్మాస్టర్లు పని చేస్తున్నారు. వీరందరికీ ఈనెల 6న మల్టీజోన్ల అలకేషన్ జరిగింది. మల్టీ జోన్–1 పరిధిలో 1,269 మంది, మల్టీ జోన్–2 పరిధిలో 973 మంది పని చేస్తున్నారు. జోన్–1 నుంచి 2కు 40 మంది, జోన్–2 నుంచి 1కు 58 మంది హెచ్ఎంలు మారారు. జిల్లాల్లో స్కూళ్లు చూపించకుండా ఖాళీల సంఖ్యచెప్పి, వారి నుంచి బలవంతంగా జిల్లాల ఆప్షన్లు తీసుకోవడంతో హెచ్‌ఎంలు నిరసన తెలిపారు. ఇప్పటి వరకు వారికి పోస్టింగ్​లు ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. 

హెచ్ఎం పోస్టు జిల్లానా.. మల్టీజోనా..?
హెడ్ మాస్టర్ల పోస్టులు జిల్లానా లేక మల్టీజోనా అనేదానిపై విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. సీనియార్టీ లిస్టును పాత జోన్ల విధానంలో తయారు చేయగా, కేడర్ స్ర్టెంత్ అలకేషన్ చేసేటప్పుడు మాత్రం ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకున్నారు. మళ్లీ పోస్టింగ్ ఇచ్చేందుకు మాత్రం మల్టీజోన్ల వారీగా ఆప్షన్లు తీసుకున్నారు. దీంతో అసలు హెచ్ఎం పోస్టు ఏ కేటగిరీ అనే దానిపై అందరిలో అయోమయమే నెలకొంది. చాలా జిల్లాల్లో ఉండాల్సిన పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయనీ, కొన్నింటిలో తక్కువగా ఉన్నాయని హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ చెప్పారు. తప్పులను సరి చేయాలని మంత్రులు, ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేదని వాపోయారు. ఆఫీసర్లు చేసిన తప్పులతో జిల్లాల్లో పోస్టులు తగ్గే అవకాశముందని, ఇప్పటికైనా వాటిని సరిచేయాలని హెడ్ మాస్టర్లు కోరుతున్నారు.