
వైద్యానికి మోడల్ స్కూల్ టీచర్ల తిప్పలు
ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు
ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డుల్లేక అవస్థలు
మెడికల్ రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వని వైనం
పట్టించుకోని విద్యా శాఖ, ప్రభుత్వ పెద్దలు
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మోడల్ స్కూల్‌లో పీజీటీ (బోటనీ)గా పనిచేస్తున్న సాయికృష్ణ బైక్‌పై వెళ్తుండగా సిద్దిపేటలో యాక్సిడెంట్ అయింది. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. తలకు బలంగా దెబ్బతగిలింది. కుటుంబీకులు అప్పుచేసి రూ.21 లక్షల వరకు ఖర్చు చేసినా.. ఇంకా కోలుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే హారీశ్‌రావు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3.50 లక్షలు ఇప్పించారు. మిగిలిన అప్పు అలాగే ఉంది. ఇంకా ఆరేడు లక్షల వరకూ ఖర్చయ్యే అవకాశముందంటున్నారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం మోడల్ స్కూల్‌లో పీజీటీ (ఇంగ్లిష్)గా పనిచేస్తున్న డి. శ్రీనిజకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు టెంపరరీ సర్జరీ చేశారు. ఇప్పటి వరకూ రూ.ఏడు లక్షల వరకూ ఖర్చు చేశారు. మెయిన్ సర్జరీకి మరో రూ.ఐదు లక్షలు ఖర్చయ్యే అవకాశముందని చెప్తున్నారు. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని వారు ఆందోళన చెందుతున్నారు.
… వారిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులు. అలాంటప్పుడు ఆరోగ్యం కోసం అప్పులు చేయడమేంటి? హెల్త్‌కార్డు ఉంటుంది కదా!! అదీ లేకపోతే మెడికల్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా? అనే అనుమానం అందరిలోనూ వస్తుంది. కానీ మోడల్ స్కూల్‌లో పనిచేసే టీచర్లు సర్కారు ఉద్యోగులే అయినా వారికి హెల్త్‌కార్డు గానీ మెడికల్ రీయింబర్స్‌మెంట్‌గానీ లేవు. దీంతో ఏదైనా అనారోగ్యానికి గురైనా, యాక్సిడెంట్ అయినా ఇలా లక్షల ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పైన చెప్పుకున్న రెండు ఘటనలే కాదు. రాష్ట్రంలో ఇలాంటివి వందల్లో ఉన్నాయి. అయినా విద్యాశాఖాధికారులు గానీ ప్రభుత్వపెద్దలు గానీ పట్టించుకోవడం లేదు.
ఆరోగ్య శ్రీ తొలగించారు
రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో 3 వేల మందికిపైగా టీజీటీ, పీజీటీలు 2013 నుంచి పనిచేస్తున్నారు. వారంతా గవర్నమెంట్ కొలువులోకి ఎక్కగానే వారికి ఉన్న తెల్ల రేషన్‌కార్డుతోపాటు ఆరోగ్యశ్రీ కార్డులు పోయాయి. అయితే సర్కారు ఉద్యోగులకు ఇచ్చినట్టు తమకూ హెల్త్‌కార్డులు ఇస్తుందని వారు భావించారు. కానీ కొలువులో చేరి ఆరేండ్లు దాటినా హెల్త్‌కార్డులు ఇవ్వలేదు. అసలు సర్వీస్ రూల్సే తయారు చేయలేదు. దీంతో టీచర్లంతా అవస్థలు పడుతున్నారు. హెల్త్‌కార్డు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ అంశం ప్రభుత్వం పరిధిలో ఉందని అధికారులు చెప్తున్నారు.
లక్షల్లో అప్పులు
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు పది మంది టీచర్లు వివిధ కారణాలతో ఈ మధ్యకాలంలో చనిపోయారు. వందలాది మంది లక్షల్లో అప్పులు చేసి, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. హెల్త్‌కార్డు వస్తే ఉద్యోగితోపాటు వారి కుటుంబ సభ్యులకూ ఉచిత వైద్యం అందే అవకాశముంది. కానీ హెల్త్‌కార్డులు లేక ఇటు టీచర్లు, అటు కుటుంబ సభ్యులు సరైన వైద్యం చేయించుకోక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా సర్వీస్‌లో ఉన్నప్పుడు చనిపోతే వారి కుటుంబాలకు ఉద్యోగం వచ్చేలా కారుణ్య నియామకాలు ఉంటాయి. కానీ మోడల్ స్కూల్ ఎంప్లాయీస్‌కు ఈ అవకాశం లేదు. దీంతో టీచర్ చనిపోతే వారి కుటుంబానికి అండలేకుండా పోతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు.
తలా కొంత సాయం..
వివిధ కారణాలతో చనిపోయిన టీచర్ల కుటుంబాలకు, హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న టీచర్లకు సర్కారు అండ లేకున్నా.. తోటి టీచర్లు మాత్రం చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. తలాకొంత జమచేసి, వారి కుటుంబాలకు అందిస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా
మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్‌కార్డుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ఈవిషయంపై డీఈఓ నుంచి మినిస్టర్ వరకూ వినతిపత్రాలిచ్చాం. ఆందోళనలూ చేశాం. అయినా ఉపయోగం లేదు. హెల్త్‌కార్డులు ఇస్తామని చెప్పి ఆ హామీ నిలబెట్టుకోలేదు. సర్వీస్ రూల్స్‌కు, హెల్త్‌కార్డులకు ముడిపెట్టడం సరికాదు. వెంటనే టీచర్లకు హెల్త్‌కార్డులివ్వాలి.
– కుల్‌దీప్‌సింగ్, ఎంఎస్‌టీఏ స్టేట్ సెక్రటరీ
హెల్త్ కార్డులివ్వాలి
సర్కారు ఉద్యోగులకు ఉండాల్సిన సౌకర్యాలు మోడల్ స్కూల్ టీచర్లకు లేవు. కనీసం హెల్త్‌కార్డులు, మెడికల్ రీయిం బర్స్‌మెంట్ సౌకర్యం కూడా కల్పించలేదు. కారణ్య నియామకాలూ లేవు. ఇప్పటికే వందలాది మంది టీచర్లు అనారోగ్యంతో సరైన వైద్యం తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం హెల్త్‌కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
– తరాల జగదీశ్, పీఎంటీఏ స్టేట్ జనరల్ సెక్రెటరీ