హలో.. ఆరోగ్యం బాగుందా?

హలో.. ఆరోగ్యం బాగుందా?

హైబీపీ, షుగర్​ పేషెంట్ల కోసం ఆరోగ్య శాఖ హెల్ప్​లైన్​
నెలకోసారి టెక్నీషియన్ల ఫోన్​
హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రతిపాదనలు
స్టేట్ ​హెల్త్​ సొసైటీ ఆమోదం

హైదరాబాద్​, వెలుగు: ఎవరైనా తెలిసినోళ్లు కనిపించినప్పుడు బాగున్నారా అని అడుగుతుంటాం. ఇకపై ఆరోగ్య శాఖ కూడా అదే చేయబోతోంది. ఫోన్​ చేసి ఆరోగ్యం ఎట్లుందో వాకబు చేయనుంది. షుగర్​, హైబీపీ పేషెంట్లకు నెలకోసారి ఫోన్​ చేసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోనుంది. అందుకు ఓ హెల్ప్​లైన్​ సెంటర్​ను ఏర్పాటు చేసి, టెక్నీషియన్లను నియమిస్తారు. దాని కోసం రూ.46 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన ప్రతిపాదనలకు రెండ్రోజుల క్రితం జరిగిన స్టేట్​ హెల్త్​ సొసైటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. పైలట్​ ప్రాజెక్ట్​గా 3 జిల్లాల్లో దానిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల్లోని పేషెంట్లకు టెక్నీషియన్లు నెలకోసారి ఫోన్​ చేసి ట్రీట్​మెంట్​, వాడుతున్న మందులు, ఆరోగ్యంపై ఆరా తీస్తారు. రోజూ ఎక్సర్​సైజ్​ చేసేలా, మందులు వాడేలా జాగ్రత్తలు చెబుతారు.

అంతేగాకుండా మందుల పంపిణీపై వారి నుంచి ఫీడ్​బ్యాక్​ కూడా తీసుకుంటారు. నెగెటివ్​గా చెబితే అధికారులపై ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటుంది. నేషనల్​ హెల్త్​ మిషన్​ (ఎన్​హెచ్​ఎం)లో భాగంగా నాన్​ కమ్యూనికెబుల్​ డిసీజెస్​ గురించి రాష్ట్రంలో సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 30 ఏండ్లు దాటిన కోటి మందికి పరీక్షలు చేయగా, సుమారు 15 లక్షల మందికి హైబీపీ, షుగర్​ ఉన్నట్టు తేలింది. వీళ్లందరికీ ప్రభుత్వమే ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికి యూనిక్​ ఐడీలతో కూడిన బుక్​లెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వాటిని ఎన్​సీడీ పోర్టల్​లో ఎంటర్​ చేసి రోగికి అందుతున్న మెడిసిన్​, హెల్త్​ చెకప్​ల వివరాలను అధికారులు ఆన్​లైన్​లో పెడతారు. వాటితో పాటే పేషెంట్​తో నేరుగా మాట్లాడేలా హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేస్తున్నారు. పేషెంట్లు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రారంభించిన గ్రీవెన్స్​ హెల్ప్​లైన్ పనిచేయట్లేదు. అధికారులు అవగాహన కల్పించక ఫిర్యాదులు చేసేందుకు ఓ నంబర్​ ఉన్నట్టూ చాలా మందికి తెలియదు.