పోక్సో కేసులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వారం రోజులు వాయిదా 

పోక్సో కేసులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వారం రోజులు వాయిదా 

హైదరాబాద్: పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‎ పిటిషన్‎పై శుక్రవారం (మే 15) విచారణ చేపడతామని పేర్కొంది . కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‎పై హైదరాబాద్‎లోని పేట్ బషీర్‎బాద్‎ పోలీస్ స్టేషన్‎లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం (మే 14) హైకోర్టులో ఈ పిటిషన్‏పై విచారణ జరగగా.. భగీరథ్ తరుఫున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

పోక్సో కేసులోనూ పిటిషనర్‌కు కొన్ని హక్కులు ఉంటాయని.. పోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలోకి పిటిషనర్ రారని వాదించారు. BNS సెక్షన్ 74, 75 కింద ఆరోపణలు రుజువు కాలేదని కోర్టుకు వివరించారు. బాధితురాలిగా పేర్కొంటున్న యువతి మైనర్ కాదని.. ఆమె వయసు 19-20 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. బాధితురాలి తల్లి తప్పుడు రికార్డులతో వయసు తగ్గించి పోక్సో కేసు పెట్టించారని ఆరోపించారు. 

ఆ యువతి పలు రకాల తేదీలతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుందన్నారు. ఈనెల8 న పేట్ బషీరాబాద్ పీఎస్‎లో నమోదైన ఫోక్సో కేసులో భగీరథ్‎పై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. తన క్లయింట్ నుంచి బాలిక ఫ్యామిలీ రూ.5 కోట్లు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడమే కాకుండా, ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరించారని వాదించారు. 

►ALSO READ | రాష్ట్ర ప్రజలు పెట్రోల్,డీజిల్ సేవ్ చేయాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసాక సెక్షన్లు మార్చడం అనుమానలకు దారి తీస్తుందని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాక కావాలనే సెక్షన్లు మార్చారని.. ఇది కుట్రపూరిత చర్యగా భావించాలని వాదించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశాక.. వాస్తవాలు తెలుసుకుని సెక్షన్లు మార్చడం జరిగిందని బాధితురాలి తరుఫు లాయర్ కౌంటర్ ఇచ్చారు. 

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‎పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. బాధితురాలు పుట్టిన రోజు డేట్స్‎పై, గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అని పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వీటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని భగీరథ్ తరుఫు లాయర్ కోరగా.. మధ్యంతర బెయిల్‎పై శుక్రవారం (మే 15) విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.