కాళేశ్వరం బ్యాక్​వాటర్​లో పంటలు ఖతం

కాళేశ్వరం బ్యాక్​వాటర్​లో పంటలు ఖతం

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా రైతులకు కన్నీళ్లు మిగులుస్తోంది. బ్యారేజీల బ్యాక్​వాటర్​తో ఏటా 10 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలతో చెన్నూర్​ నియోజకవర్గంలోని జైపూర్, చెన్నూర్, కోటపల్లి, బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలాల్లోని రైతులు ఏటా రూ. 50 కోట్లకు పైగా పంట నష్టపోతున్నారు. గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో మూడేండ్లుగా ఇదే పరిస్థితి. కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో 2019 నుంచి పంటలు మునుగుతున్నాయి. రైతులు జులైలో పత్తి, మిర్చి, వరి పంటలు వేసుకుంటుంటే ఆగస్టు, సెప్టెంబర్​ మాసాల్లో వరదలొచ్చి పంటలను ముంచేస్తున్నాయి. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో వాటర్ స్టోర్​చేయడం, వరదలు వచ్చినప్పుడు ఒకేసారి గేట్లు ఓపెన్​ చేయడం వల్ల బ్యారేజీల కింద పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. మరోవైపు వరద నేరుగా వెళ్లక బ్యాక్​వాటర్ ​పొలాలను ముంచెత్తుతోంది. ఇటీవల ఇలాగే పొలాలు మునిగి రూ. 50 కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లింది. బ్యారేజీలు కట్టేటప్పుడు ఇరిగేషన్​ ఆఫీసర్లు అంచనా వేసిన వరద కంటే రెండు లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తున్నట్టు సమాచారం. ముంపును నివారించేందుకు గోదావరి పొడవునా కరకట్టలు నిర్మించాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వేల కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీలు కట్టిన సర్కారు అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే కరకట్టలు ఎందుకు నిర్మించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. 
పంటలకు అందని పరిహారం
కాళేశ్వరం బ్యారేజీల కారణంగా మునిగిపోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం కూడా చెల్లించడం లేదు. మూడేండ్లుగా అగ్రికల్చర్​ఆఫీసర్లు సర్వే చేసుకొని పోతున్నారు తప్పితే రైతులకు పైసా పరిహారం అందలేదు. రైతులు నీటమునిగిన పంటలను చెడగొట్టి మళ్లీ వేసుకుంటున్నారు. ఈ ఏడాది జులై నెలాఖరులో పత్తి చేలు మునిగిపోతే తిరిగి వేసుకున్నారు. పత్తి పూత దశకు రాగానే ఇటీవల వచ్చిన వరదలకు మరోసారి నీటిపాలైంది. రైతులు ఎకరానికి రూ.50వేల దాకా పెట్టుబడి పెట్టారు. మూడేండ్లలో రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. రైతులు అప్పులపాలై గోడున ఏడుస్తుంటే... ప్రజాప్రతినిధులు కనీసం వారివైపు కూడా చూడడం లేదు. ఎమ్మెల్యే బాల్క సుమన్​మూడేండ్లలో మొన్న ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా మూడు గ్రామాల్లో పర్యటించారని రైతులు మండిపడుతున్నారు.  మూడేండ్లుగా నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని,  ముంపు భూములను ప్రభుత్వం తీసుకొని రైతులకు మరోచోట భూమికి బదులు భూమి ఇయ్యాలని, రైతులకు ఎకరానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. 
నేడు ఇందిరాపార్కు వద్ద దీక్ష
కాళేశ్వరం వాటర్​తో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ స్టేట్​కోర్​కమిటీ మెంబర్, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​జి.వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో రెండేండ్లుగా రైతులు పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో సోమవారం వెయ్యి మంది ముంపు రైతులతో వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ దగ్గర రైతు భరోసా దీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​వెరబెల్లి రఘునాథ్​రావు అధ్యక్షతన జరిగే దీక్షలో చీఫ్​గెస్ట్​గా డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి, గెస్ట్​గా విజయశాంతితో పాటు కిసాన్​మోర్చా లీడర్లు పాల్గొంటారని డిస్ర్టిక్ట్​ జనరల్ ​సెక్రటరీ అందుగుల శ్రీనివాస్​ చెప్పారు. 
రూ. 5 లక్షలు లాస్​ అయిన..
ఈ ఏడాది పదెకరాల్లో మిర్చి, ఆరెకరాల్లో పత్తి పెట్టిన. నెలన్నర కిందట మొత్తం మునిగింది. ఆ పంటలు చెడగొట్టి మళ్లా పెట్టిన. వారం కిందట మళ్లోసారి మునిగింది. కౌలు డబ్బులతో కలిపి రూ. ఐదు లక్షలు లాస్​ అయిన. ఆఫీసర్లు సర్వే చేసుకొని పోయిన్రు. ఇంతవరకు సర్కారు పైసా ఇయ్యలే. పరిహారం ఇచ్చి ఆదుకోకుంటే మాకు చావే గతి.                                                                                   – నీలం పెద్ద శ్రీనివాస్​, చెన్నూర్​