
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. ఫిల్మ్ నగర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీ కా పూల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీస్లు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నానా యాతన పడ్డారు.
శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. కేబీఆర్ పార్క్, పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. వాయుగుండం కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. గురు, శుక్ర, శనివారం.. ఈ మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. జనగాం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మోస్తారు వర్ష సూచన చేసింది.
హైదరాబాద్ వర్షం అప్డేట్స్:
* హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
* పగలంతా ఎండ, ఉక్కపోత.. సాయంత్రానికి కమ్మేసిన కారు మేఘాలు
* పగలంతా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో గాలిలో పెరిగిన తేమశాతం
* గాలిలో పెరిగిన తేమ శాతంతో నగరంలో ఏర్పడ్డ క్యూమిలో నింబస్ మేఘాలు
* క్యూమిలో నింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో దంచి కొట్టిన వర్షం
* హైదరాబాద్ సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
* ఈదురుగాళ్లు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం
* ఇప్పటికే GHMC, DRF, Monsoon, హైడ్రా టీమ్స్ను అప్రమత్తం చేసిన IMD
* ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు చెట్ల కింద, పాత భవనాల కింద ఉండొద్దని సూచన