హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం: ట్రాఫిక్ జాంలో వాహనదారులు

హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం: ట్రాఫిక్ జాంలో వాహనదారులు

హైదరాబాద్ సిటీ మొత్తం జోరు వాన.. సిటీ వ్యాప్తంగా పడుతుంది. 2025, సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు మొదలైన వర్షం ఆగకుండా పడుతుంది. సిటీ మొత్తం వర్షం ఉండటం.. అది కూడా ఈవినింగ్ టైం కావటం.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. సిటీలో చాలా ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా సాగటమే కాదు.. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు ఉండటంతో.. ట్రాఫిక్ జాం అయ్యింది. కుండపోత వర్షం కాదు.. అలా అని వర్షంలో వెళ్లేంత చిన్న వాన కాదు.. గంట నుంచి ఒకే విధంగా వర్షం పడుతుంది.

సిటీలోని బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, ప్యారాడైజ్, బేగంపేట్, సింధీకాలనీ, కంటోన్మెంట్, మారేడు పల్లి, పికెట్, కార్ఖానా, బోయిన్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, దిల్ సుఖ్‎నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. 

సిటీ శివారు ప్రాంతంలోని రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ జాగర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్, నార్సింగి,  మణికొండ, పుప్పాలగూడ కోకాపేట్, గండిపేట్  తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.  శంషాబాద్ మండల పరిధిలోని శంషాబాద్, షాపూర్, సుల్తాన్ పల్లి, రాళ్లగూడ, సతం రాయ్, గగన్ పహాడ్, తొండుపల్లి, గండిగూడ,మధుర నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

హయత్ నగర్‎లో కుండపోత వర్షం పడటంతో హయత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. మోకాళ్ల లోతు వరకు నీళ్లు రావడంతో వనస్థలిపురం ఆటోనగర్ నుంచి హయత్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హయత్ నగర్ కోర్టు ప్రాంగణాన్ని వరద నీరు చుట్టుముట్టింది. సరిగ్గా ఆఫీసులు, విద్యా సంస్థల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. 

భారీ వర్షం పడుతుండడంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతోంది. ద్విచక్ర వాహనాలు మెట్రో స్టేషన్లు, బ్రిడ్జీలు, షటర్ల కింద తలదాచుకుంటున్నారు. వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు జామ్ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండటంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయల్దేరాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రద్దీని కంట్రోల్ చేస్తున్నారు.