కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాలనీలకు కాలనీలు నీట మునిగిన పరిస్థితి ఉంది. సుభాష్ నగర్, ఆదర్శనగర్ కాలనీలు జలమయం కావడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయినర్ల సహాయంతో డ్రైనేజీలు క్లీన్ చేయించి వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
కరీంనగర్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కట్టరాంపూర్ నాగన్న చౌరస్తా దగ్గర ఓ ఇంటి ప్రహరీ కూలింది. గోడతో పాటు పక్కనే ఉన్న భారీ వృక్షం కూడా నేలకొరిగింది. అటుగా నిలిపి ఉన్న కారుపై శిథిలాలు పడటంతో కారు స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
భారీ ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలు పడుతున్న క్రమంలో.. పాత గోడలు, భారీ వృక్షాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షానికి పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగి కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ప్రాంగణం అంతా జలమయమైంది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో పిడుగు పడింది. మొబైల్తో వర్షాన్ని రికార్డ్ చేస్తుండగా స్థానికుడు పిడుగుపాటుతో ఉలిక్కిపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
