హైదరాబాద్, వెలుగు: ఎన్నారై వ్యాపారవేత్త వి.ధర్మేంద్రను పెండ్లి పేరుతో మోసం చేశానంటూ తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని నటి అషురెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అషురెడ్డి, ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జె. శ్రీనివాసరావు బుధవారం విచారించారు.
వారి తరఫు న్యాయవాది వాదిస్తూ పిటిషనర్లు ఎలాంటి మోసం చేయలేదని, ఎదుటివారే పెండ్లి కోసం ఒత్తిడి చేసి స్వచ్ఛందంగా ఖర్చు పెట్టారని, దానికి పిటిషనర్లు బాధ్యులు కాదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు గడువు కావాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణను మే 4కు వాయిదా వేసింది.

