ఎయిర్పోర్టు భూమి స్వాధీనం రద్దు : హైకోర్టు

ఎయిర్పోర్టు భూమి స్వాధీనం రద్దు : హైకోర్టు
  • కంచ గచ్చిబౌలిలో 9 ఎకరాలపై తహసీల్దార్‌‌ ఉత్తర్వులు చెల్లవు: హైకోర్టు
  • ఎయిర్‌‌పోర్ట్సు అథారిటీ పిటిషన్‌‌పై తీర్పు

హైదరాబాద్, వెలుగు: 
ఎయిర్ పోర్ట్సు అథారిటీ ఆఫ్‌‌ ఇండియా అధీనంలో  ఉన్న కంచ గచ్చిబౌలిలోని తొమ్మిది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నం.26లో ఎయిర్‌‌పోర్ట్స్ అథారిటీ ఆధీనంలోని ఖాళీగా ఉన్న తొమ్మిది ఎకరాల భూమి స్వాధీనం కోసం 2008 ఫిబ్రవరి 26న తహసీల్దార్‌‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌‌ చెల్లవని, వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూమిని స్వాధీనం చేసుకోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నం.26లోని తొమ్మిది ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ తహసీల్దార్‌‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎయిర్‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా 2008లో హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌కుమార్‌‌ ఇటీవల తీర్పు వెలువరించారు. 

ఎయిర్‌‌పోర్ట్స్ అథారిటీ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ విమాన సర్వీసుల నిర్వహణ, ఎయిర్‌‌ ట్రాఫిక్‌‌ కంట్రోల్​తదితరాల కోసం రేడియో నేవిగేషనల్‌‌ ఎయిడ్‌‌ (వీఓఆర్‌‌) కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1966- –67లో తొమ్మిది ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ఈ భూమి ఒరిజినల్‌‌ సేల్‌‌డీడ్‌‌ కనిపించకపోవడంతో కాపీ ఇవ్వాలంటూ పలు లేఖలు రాసినా తహసీల్దార్‌‌ స్పందించలేదని, దీంతో చివరికి 1991లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అయితే రెవెన్యూశాఖ కార్యదర్శి తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా ఖాళీగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు 1991లో నోటీసు ఇచ్చారన్నారు. 

ఒరిజినల్‌‌ పత్రాలు, ఇతర వివరాలు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. 2008 జనవరిలో భూమి స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ఇవ్వగా తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1991లో నోటీసులోనే జారీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులకు సంబంధించి ఇచ్చిన ఒప్పంద పత్రాలను సమర్పించలేదన్నారు. పరిహారం చెల్లించినట్లు చెబుతున్నా ఆధారాలు సమర్పించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూమిని స్వాధీనం చేసుకోవడం చెల్లదని, తహసీల్దార్‌‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌‌ రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.