
హైదరాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో పంచాయతీ అధికారి, కార్యదర్శులు అక్రమాలకు పాల్పడతున్నారంటూ గతేడాది డిసెంబరు 9న వినతిపత్రం సమర్పించినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రుద్రంగికి చెందిన పి.నరేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది తీగల రాంప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి పి.సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రాందాస్ చౌహాన్‌లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. డబ్బు కోసం ప్రభుత్వానికి చెందిన భూమిలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారన్నారు. పభుత్వ భూముల్లో షెడ్‌ల నిర్మాణం జరిగిందని, వాటిని తొలగించి రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డివిజనల్ పంచాయతీ అధికారి దీనిపై విచారణ జరిపించి నివేదిక తెప్పించారన్నారు. ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్ సమక్షంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీలో అక్రమాలపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విచారణను మూసివేసింది.