స్థలాలకు ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేసే ముందు ఆధారాలు ఉండాలి..హైడ్రాకు హైకోర్టు ఆదేశం

స్థలాలకు ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేసే ముందు ఆధారాలు ఉండాలి..హైడ్రాకు హైకోర్టు ఆదేశం
  • ప్రైవేటు జాగాకు వేసిన ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఒక స్థలానికి ప్రభుత్వ భూమి అని చెప్పి పెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేసే ముందు చట్టపరమైన ఆధారాలు ఉండాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. ఆధారాలను సేకరించి సంబంధిత కోర్టు లేదంటే హైకోర్టు అనుమతి తీసుకుని ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేయాలంది. ఒక ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ జాగాకు పెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేసి ఆ చర్యను సమర్థించుకునేందుకు ప్రయత్నాలు చేయొద్దని సూచించింది.

రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌‌‌‌‌‌‌‌ మండలం మల్లాపూర్‌‌‌‌‌‌‌‌లోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100లోని బాబానగర్‌‌‌‌‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ లేఔట్‌‌‌‌‌‌‌‌లోని రెండు ప్లాట్లకు వేసిన కంచెను వెంటనే తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు ఖర్చుల నిమిత్తం రూ. లక్ష చెల్లించాలంది. కంచె తొలగింపునకు గడువు కావాలని హైడ్రా కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

గడువు కావాలంటే కంచె తొలగించే వరకు ఒక రోజుకు రూ.లక్ష చొప్పున పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు చెల్లించాలని చెప్పింది. సొసైటీలో 500 చదరపు గజాలు చొప్పున ఉన్న రెండు ప్లాట్లకు హైడ్రా ఏకపక్షంగా కంచె వేసి బోర్డు ఏర్పాటు చేయడాన్ని జొన్నలగడ్డ పద్మాని మరొకరు వేర్వేరుగా వేసిన వ్యాజ్యాలను జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్వీ శ్రవణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఇటీవల విచారించారు. ఈ వ్యవహారంపై గతంలోనే హైకోర్టు నిజ నిర్ధారణ కోసం అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్‌‌‌‌‌‌‌‌ సమర్పించిన నివేదికలో పిటిషనర్లు, హైడ్రా వేర్వేరు లేఔట్లు సమర్పించారన్న విషయాన్ని న్యాయమూర్తి గుర్తించారు. సంబంధం లేని స్థలాలకు హైడ్రా కంచె వేసిందని తేల్చారు. ఆ రెండు ప్లాట్లు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులవని ధ్రువీకరించిన కింది కోర్టు.. శాశ్వత ఇంజంక్షన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసిందన్నారు. ఈ నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి హైడ్రాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ వేసే ముందు చట్టపరమైన ఆధారాలు చూపాలని స్పష్టం చేసింది.