ఆ రైతు భూమిని స్వాధీనం చేసుకోవద్దు : హైకోర్టు

ఆ రైతు భూమిని స్వాధీనం చేసుకోవద్దు : హైకోర్టు
  • భూభారతి దరఖాస్తుపై నిర్ణయం వచ్చేవరకు ఆగాలి
  • చట్ట ప్రక్రియ లేకుండా భూమి నుంచి రైతును ఖాళీ చేయించొద్దు
  • అధికారులకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: భూ భారతి పోర్టల్‌‌లో దాఖలు చేసిన దరఖాస్తుపై తుది నిర్ణయం తీసుకునే వరకు రైతును ఆ భూమి నుంచి బలవంతంగా వెళ్లగొట్టరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రయోజన అవసరాల కోసం భూమిని తీసుకోవాలనుకున్నా చట్టబద్ధ ప్రక్రియను కచ్చితంగా అనుసరించాలని అధికారులను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం పెద్ద అంబర్‌‌పేట్ గ్రామానికి చెందిన పిట్టల ముత్యాలు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌‌పై జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పెద్ద అంబర్‌‌పేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 244/104లో ఎకరం 20 గుంటల భూమిని తమ కుటుంబం దశాబ్దాలుగా సాగు చేసుకుంటోందని తెలిపారు. పాత రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదై ఉన్నప్పటికీ ఈ- పాస్‌‌బుక్ జారీ కాలేదని, అందుకోసం భూభారతి పోర్టల్‌‌లో దరఖాస్తు చేసుకున్నానని పిటిషనర్ తెలిపారు. ఈ దరఖాస్తును నిర్దిష్ట గడువులోగా పరిశీలించాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చినా అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు.

ఇదే సమయంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పేరుతో నోటీసులివ్వకుండా తన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరఫున హాజరైన అధికారులు పిటిషనర్ వాదనలను ఖండించారు. సర్వే నంబర్ 244కు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమిగా నమోదైందని తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం గుర్తించిన భూమి సర్వే నంబర్ 244/105లో ఉందని, పిటిషనర్ పేర్కొంటున్న 244/104లో కాదని కోర్టుకు వివరించారు.

పిటిషనర్ పేరు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో కూడా లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు, పిటిషనర్ భూ భారతి దరఖాస్తుపై తుది నిర్ణయం తీసుకునే వరకు అతడిని భూమి నుంచి బలవంతంగా తొలగించరాదని స్పష్టం చేసింది. ఒకవేళ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాల్సి వస్తే ముందుగా భూభారతి దరఖాస్తును పరిష్కరించాలని, అనంతరం సంబంధిత వ్యక్తికి షోకాజ్ నోటీసు జారీ చేసి, అతడి వివరణను పరిశీలించాక చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.