- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్ నిర్ధారణ చేయకపోవడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, పిటిషన్‌లు, కోర్టు ధిక్కరణ పిటిషన్‌లలో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేకపోతే తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీలో రూ.5 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేసిన తరువాత మరో రెండు వారాల్లో పిటిషనర్లు రిప్లయ్ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
రాయదుర్గంలోని మల్కం చెరువు, కూకట్‌పల్లి హైదర్‌గూడలో కింది కుంట, సంగారెడ్డిలోని అమీన్‌పూర్ చెరువు, ఉప్పల్ రామంతాపూర్‌లోని చిన్నచెరువు తదితర చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారించడం, రక్షణకు చర్యలు చేపట్టకపోవడం, వ్యర్థాలను నింపి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం తదితరాలపై ఐపీఎస్ అధికారి సిన్హా, లూబ్నా సార్వత్‌తోపాటు పలు ఇతర సంస్థలు, వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ..మల్కం చెరువుకు సంబంధించి దాఖలు చేసిన కౌంటర్లనే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మిగిలిన పిటిషన్‌లలో కౌంటరు వేయడానికి మరో రెండు వారాల గడువు కావాలని కోరారు.
