విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్లను సమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

విద్యుత్  ఉద్యోగుల ప్రమోషన్లను సమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌‌ విద్యుత్‌‌  సంస్థల్లో రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన పదోన్నతుల వ్యవహారంపై గత ఉత్తర్వుల్ని అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై హైకోర్టు బుధవారం విచారించింది. ప్రమోషన్లను సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అక్టోబర్‌‌ 6లోగా రిపోర్టు ఇవ్వాలని విద్యుత్‌‌ సంస్థలను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతుల్లో రిజర్వేషన్లు, పర్యవసానంగా రావలిసిన సీనియారిటీలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కారణంగా నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు చేయలేదంటూ రాష్ట్ర విద్యుత్‌‌  ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్‌‌  అభినంద్‌‌  కుమార్‌‌ షావిలీ ఇటీవల విచారణ జరిపి విద్యుత్‌‌  సంస్థలకు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు 2019లో జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసే పనిలో యాజమాన్యాలు ఉన్నాయని విద్యుత్‌‌  సంస్థల అడ్వొకేట్  చెప్పారు. విద్యుత్‌‌  సంస్థల్లో సుమారు 80 మంది సీనియర్‌‌  ఇంజినీర్లకు, అధికారులకు పదోన్నతుల రివర్షన్లకు సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు ఆరునెలల గడువు కావాలన్నారు. ఇప్పటికే 6 మాసాల గడువు తీసుకొని ఎలాంటి చర్యలు చేపట్టలేదని, మళ్లీ గడువు కోరడం అన్యాయమని పిటిషనర్ల తరపు అడ్వొకేట్  అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనల తర్వాత నివేదిక అందజేయాలని విద్యుత్‌‌ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.