- పిటిషనర్ల వాదన వినకుండా సేల్ డీడ్స్ రద్దు చేశారు
- ఆ రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 453 సేల్‌డీడ్స్‌ను ఆ జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా రద్దు చేశారని హైకోర్టు తేల్చింది. పిటిషనర్లకు నోటీసులు కూడా ఇవ్వకుండా, వాళ్ల వాదనలు వినకుండా సేల్‌డీడ్స్ రద్దు చేయడం చెల్లదని తీర్పు చెప్పింది. కొత్తపల్లిలోని సర్వే నంబర్ 197, 198లో భూముల సేల్‌డీడ్‌లను కలెక్టర్ రద్దు చేయడాన్ని హనుమాజీపల్లికి చెందిన లింగాల పద్మతో పాటు మరికొందరు వేసిన 35 పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్లకు నోటీసు కూడా ఇవ్వకుండా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు.
తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్–1908లోని సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ పిటిషనర్ వాదన వినకుండా ఏకపక్షంగా సేల్‌డీడ్స్ ను కలెక్టర్ రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ లోకాయుక్తాకు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ నియమాలు–2016లోని రూల్ 243 కింద కలెక్టర్ 453 సేల్‌డీడ్‌లను రద్దు చేసే ముందు పిటిషనర్ల వాదనలు వినలేదని తప్పుపట్టారు. భూములను సెక్షన్ 22ఏ పరిధిలోకి తీసుకురాలేరంటూ కలెక్టర్ ఉత్తర్వులు రద్దు చేశారు.
ఇదీ నేపథ్యం..
భూముల వివాదం 1975 నుంచి ఉంది. షేక్ సలేహ్, ఇతర కుటుంబ సభ్యులు సీలింగ్ చట్టం కింద కొత్తపల్లి రేకుర్తి గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలోని కొన్ని భూములను మిగులు భూములుగా ప్రకటించారు. అయితే, అది మోసపూరిత ప్రకటన అని 1998లో అధికారులకు ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని 2017లో లోకాయుక్త ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అవి ప్రభుత్వ భూములని పేర్కొంటూ కలెక్టర్ ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. కలెక్టర్ నిర్ణయాన్ని పిటిషనర్లు సవాలు చేశారు. వాదనలు చెప్పుకునే అవకాశం పిటిషనర్లకు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చింది.
ఇదే సమయంలో నిషేధిత భూములకు సంబంధించి చట్టప్రకారం 22ఏ కింద చేర్చే ముందు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు.. వింజమూరి రాజగోపాలచారి కేసులో ఇచ్చిన తీర్పును జడ్జి ప్రస్తావించారు. ఒకే అంశంపై సింగిల్ జడ్జిలు వేర్వేరు తీర్పులు చెప్పడంపై చీఫ్ జస్టిస్‌కి నివేదించాలని చెప్పారు. ఇక్కడ రెండు డివిజన్ బెంచ్‌లు వేర్వేరు తీర్పు చెప్పిన అంశమని, దీనిని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
