హైదరాబాద్, వెలుగు: భదాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచలను విలీనం చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. గత ఏడాది మే 29న జారీ చేసిన జీవో నంబర్103 అమలుపై స్టే ఇవ్వడానికి పిటిషనర్లు ఆధారాలు సమర్పించలేదంది. కౌంటర్ దాఖలుకు ఇంప్లీడ్ పిటిషనర్లకు అవకాశం ఇచ్చింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతేడాది మే 29న జీవో నంబర్ 103ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పాల్వంచ మండలం గట్టాయగూడెనికి చెందిన ప్రవీణ్ కుమార్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం కార్పొరేషన్‌లో విలీనం చేసిన ఏడు గిరిజన గ్రామ పంచాయతీలు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంత పరిధిలోకి వస్తాయన్నారు. వాదనలు విన్న బెంచ్.. పిటిషనర్లు చెబుతున్న ఏడు గ్రామాలు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎలా ఉన్నాయో స్పష్టం చేయలేకపోవడంతో జీఓ అమలుపై స్టే ఇవ్వలేమని పేర్కొంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
