V6 News

ధాన్యం దారిమళ్లింపు కేసులో వాదనలు పూర్తి.. తీర్పు వాయిదా వేసిన  హైకోర్టు

ధాన్యం దారిమళ్లింపు కేసులో వాదనలు పూర్తి.. తీర్పు వాయిదా వేసిన  హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ధాన్యం దారిమళ్లింపు కేసుపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు తీర్పును వాయిదా వేసింది. దాదాపు రూ. 3,960 కోట్లు విలువైన ధాన్యం దారిమళ్లించారనే ఆరోపణలతో సుమారు 360 మంది రైస్ మిల్లర్లపై రాష్ట్ర సివిల్ సప్లైయ్ కార్పొరేషన్ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వారి మిల్లులు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసింది. ఈ క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె. శ్రీనివాసరావు గురువారం విచారణ చేపట్టారు. మిల్లర్ల తరపున సీనియర్ న్యాయవాది ఆర్.ఎన్. హేమేంద్రనాథ్‌‌రెడ్డి వాదిస్తూ..2022-~23 సీజన్‌‌లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నాణ్యత చాలా తక్కువగా ఉందన్నారు.

దానివల్ల మిల్లింగ్ చేయడం సాధ్యం కాలేదని తెలిపారు. ఆ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వమే నిర్ణయించిందని చెప్పారు. మిల్లింగ్ చేయవద్దని చెప్పి, ఇప్పుడు బియ్యం ఇవ్వలేదని కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు.  మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్ ఛార్జీలు, స్టోరేజీ ఖర్చులు, గన్నీ బ్యాగుల సొమ్మును ప్రభుత్వమే ఇంకా చెల్లించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ..ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్లు అక్రమంగా దారి మళ్లించినట్లు (అమ్ముకున్నట్లు) ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లింది కాబట్టి మిల్లర్లు దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.