హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రాలోలోని 90.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు లోక్‌అదాలత్‌లో మోసపూరితంగా రాజీ చేసుకున్నారు. ఆ అవార్డు అమలు చేయాలని కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై గురువారం హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. ఎవాక్యూ ప్రాపర్టీకి సంబంధించి కింది కోర్టులో వివాదంలో ఉన్న కేసులో కలెక్టర్, తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్‌ను ప్రతివాదులుగా చేర్చకుండా వారు నామమాత్రమేనంటూ ప్రైవేట్ వ్యక్తులు 2019లో లోక్‌అదాలత్ అవార్డు పొంది దాని అమలుకు కింది కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారించిన కింది కోర్టు లోక్‌అదాలత్ అవార్డును అమలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మేడ్చల్ మల్కాజిగిరిలో 90 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ కి 2011లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా దాన్ని తొక్కిపెట్టి మోసపూరితంగా 2019లో ప్రైవేట్ వ్యక్తులు మళ్లీ భాగపరిష్కార సూట్ వేసి లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లు అవార్డు పొందారన్నారు.

