కేంద్ర బడ్జెట్‌‌‌‌ పై గంపెడు ఆశలు.. విభజన హామీలు, భారీ ప్రాజెక్టు ల నిధుల కోసం ఎదురుచూపులు

కేంద్ర బడ్జెట్‌‌‌‌ పై  గంపెడు ఆశలు.. విభజన హామీలు, భారీ ప్రాజెక్టు ల నిధుల కోసం ఎదురుచూపులు
  •     నేడు నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ తో ఉత్కంఠకు తెర 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా నిధుల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయం ఇంకా 'అందని ద్రాక్ష'గానే మిగిలిపోయింది. విభజన చట్టం హామీలతో పాటు దాదాపు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టాను కేంద్రం ముందుంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆదివారం పార్లమెంట్‌‌‌‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌‌‌‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ విశ్వనగర విస్తరణకు, మౌలిక వసతులకు ఊతమిచ్చే భారీ ప్రాజెక్టుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ముఖ్యంగా రూ.34,367 కోట్లతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్డు , ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్‌‌‌‌ను కలిపే రూ.45,000 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కోసం గట్టిగా పట్టుబడుతోంది. 

అలాగే, మెట్రో రెండో దశ విస్తరణకు రూ.44,028 కోట్లు, గోదావరి-మూసీ అనుసంధానానికి రూ.6,000 కోట్లు, బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ డ్రై పోర్ట్ వరకు రూ.17 వేల కోట్లతో గ్రీన్‌‌‌‌ఫీల్డ్ హైవే వంటి ప్రతిపాదనలు కేంద్రం వద్ద మోక్షం కోసం ఎదురుచూస్తున్నాయి. వరంగల్ అండర్‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌‌‌‌ నిధులపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ (ఖమ్మం, మహబూబాబాద్),  ఎనిమిది కొత్త రైల్వే లైన్ల మంజూరుపై ఈసారైనా స్పష్టత వస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

ఆదిలాబాద్, కొత్తగూడెం సహా జిల్లాకో విమానాశ్రయం, హైదరాబాద్‌‌‌‌కు ఐఐఎం, కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరు కోసం రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. పీఎం ఆవాస్ యోజన ఇండ్లు, సింగరేణికి కొత్త బ్లాకులు, సెమీకండక్టర్ మిషన్, కాకతీయ టెక్స్‌‌‌‌టైల్ పార్క్ నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరుణిస్తారా? లేక ఎప్పటిలాగే మొండిచేయి చూపుతారా? అన్నది ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్​లో  తేలనుంది.

ఇయ్యాల అర్ధరాత్రి రాష్ట్రానికి సీఎం

సీఎం  రేవంత్ రెడ్డి సోమవారం అర్ధరాత్రికి రాష్ట్రానికి చేరుకోనున్నారు. బడ్జెట్‌‌‌‌లో రాష్ట్రానికి కేటాయింపులు, కేంద్రం తీరుపై చర్చించడంతో పాటు రానున్న మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు సోమవారం మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానునట్లు తెలిసింది.  గత నెల 19న హైదరాబాద్​ నుంచి సీఎం దావోస్​ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి బోస్టన్​లోని హార్వర్డ్​ స్కూల్​లో లీడర్ షిప్ ​ ఇన్​ ది ట్వంటీ ఫస్ట్​ సెంచరీ అనే ప్రత్యేక  కోర్సు చేశారు. శనివారం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్​కు బయలుదేరారు.