కరీంనగర్ లో హై టెన్షన్.. ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం

కరీంనగర్ లో హై టెన్షన్.. ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి..  కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం

కరీంనగర్ టౌన్  లో ఉద్రిక్తత నెలకొంది.  బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా..  ఎమ్మెల్యే  గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ నేతలు  దాడి చేశారు.  క్యాంప్ ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డి  కారును  ధ్వంసం చేశారు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టి , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. 

దాడి సమయంలో క్యాంప్ ఆఫీసులోనే  ఉన్న  ఎమ్మెల్యే   కౌశిక్ రెడ్డిని గదిలోకి తరలించారు బీఆర్ఎస్ నేతలు. పోలీసులు కల్గజేసుకుని పలువురు బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.  బీజేపీ దాడిని బీఆర్ఎస్ నేతలు ఖండించారు.

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు

మే 7న ఉదయం పాడి కౌశిక్ రెడ్డి  కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో  కేంద్రమంత్రి బండి సంజయ్ పై  తీవ్ర విమర్శలు చేశారు.   కరీంనగర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ ఒక బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. బండి సంజయ్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో భారీ దోపిడీ జరిగితే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని కౌషిక్ రెడ్డి ప్రశ్నించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా బండి సంజయ్ ఒక్క రివ్యూ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎజెండానే మాట్లాడుతున్నారని, రేవంత్ నోట ఏ మాట వస్తే సంజయ్ అదే మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

గతంలో తన భార్య పుస్తెలు అమ్మి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన బండి సంజయ్.. కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఎలా ఖర్చు చేశారని కౌషిక్ రెడ్డి నిలదీశారు. కేటీఆర్‌ను తిట్టే స్థాయి బండి సంజయ్‌కు లేదని.. దమ్ముంటే సబ్జెక్టుపై, కరీంనగర్ అభివృద్ధిపై కేటీఆర్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నారు.. మరి బండి సంజయ్ సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.