ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకముందే ఆత్మహత్యగా ఎలా తేలుస్తారు..? సూర్యాపేట పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం

ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకముందే ఆత్మహత్యగా ఎలా తేలుస్తారు..? సూర్యాపేట పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం
  • కొత్తగా ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లాకు చెందిన ఎస్సీ యువకుడు నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో  హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసు దర్యాప్తును  సీబీఐకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2022 అక్టోబరులో నిఖిల్ అదృశ్యమై, ఆ తర్వాత గాయాలతో శవమై కనిపించాడు. అయితే, పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరపలేదని ఆరోపిస్తూ నిఖిల్ తండ్రి దారావత్ భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఎన్. తుకారాంజీ బుధవారం విచారణ చేపట్టారు.  

పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. నిఖిల్‌‌‌‌ది ఆత్మహత్య కాదని, అతడు ప్రేమించిన యువతి కుటుంబ సభ్యుల దాడుల వల్లే అతను చనిపోయాడని కోర్టుకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటాను సరిగ్గా పరిశీలించకుండానే పోలీసులు దీనిని ఆత్మహత్యగా తేల్చేశారని వాదించారు. కోర్టు స్పందిస్తూ..నిఖిల్ శరీరంపై ఎడమచేయి, పక్కటెముకలు, మెడపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పంచనామా రికార్డుల్లో ఉందని పేర్కొంది.  ఫోరెన్సిక్ రిపోర్ట్  రాకముందే పోలీసులు ఆత్మహత్య కోణంలో నిఖిల్‌‌‌‌ కేసును దర్యాప్తు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

కీలకమైన డిజిటల్ ఆధారాలను భద్రపరచడంలో పోలీసులు విఫలమయ్యారని, యువతి కుటుంబం వ్యతిరేకించిన కోణాన్ని అస్సలు దర్యాప్తు చేయలేదని తప్పుబట్టింది. ఒక విభాగం నుంచి మరో విభాగానికి (సీఐడీ) కేసును మార్చినంత మాత్రాన పక్షపాత అనుమానాలు తొలగిపోవని కోర్టు స్పష్టం చేసింది. 

అందువల్ల, సీబీఐ కొత్తగా ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసి హత్య, బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోణాల్లో దర్యాప్తు చేయాలని  హైకోర్టు ఆదేశించింది. నిఖిల్ వైద్య నివేదికలను నిపుణులతో పునఃపరిశీలన చేయించాలని, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలను మళ్లీ సమగ్రంగా తనిఖీ చేయాలని సూచించింది. పోలీసులు, సీఐడీ వద్ద ఉన్న పాత రికార్డులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును ఆరు నెలల్లోగా పూర్తి చేసి, ఆ పురోగతి వివరాలను అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది.