గ్రాడ్యుయేట్ల కంటే నిరక్షరాస్యులకే ఉపాధి ఎక్కువ.!

గ్రాడ్యుయేట్ల కంటే  నిరక్షరాస్యులకే ఉపాధి ఎక్కువ.!
  • 29 శాతానికి పెరిగిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు
  •  నైపుణ్యాలకు, ఉద్యోగాలకు మధ్య సంబంధం లేకపోవడమే కారణం
  • ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ వెల్లడి

సెంట్రల్​ డెస్క్​, వెలుగు:  దేశంలో ఉన్నత విద్యను చదివిన యువత నిరుద్యోగ రేటు కంటే ఎలాంటి చదువూలేని నిరక్షరాస్యుల నిరుద్యోగ రేటు చాలా తక్కువగా ఉంది. అంటే గ్రాడ్యుయేట్ల కంటే ఎలాంటి చదువు రానివాళ్లే ఏదో ఒక జాబు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) వెల్లడించింది. దేశంలో చదవడం, రాయడం రాని వ్యక్తుల నిరుద్యోగ రేటు 3.4 శాతంగా ఉంటే.. చదువుకున్న గ్రాడ్యుయేట్ల అన్ఎంప్లాయిమెంట్ రేటు 29.1 శాతంగా ఉంది. అంటే గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు నిరక్షరాస్యుల కంటే దాదాపు 9  రెట్లు ఎక్కువగా ఉంది. దేశంలో 2000లో 15 నుంచి 29 ఏండ్ల వయస్సు గలవారి నిరుద్యోగం 88.6 శాతం ఉంటే..2022నాటికి అది 82.9 శాతానికి తగ్గింది. 2000లో విద్యావంతులైన యువత శాతం 54.2 శాతముంటే 2022 నాటికి అది 65.7 శాతానికి పెరిగింది.

మహిళల నిరుద్యోగం 76 శాతం 

దేశంలోని చదువుకున్న నిరుద్యోగ యువతలో మహిళలు 76.7 శాతం ఉండగా.. పురుషులు 62.2 శాతం ఉన్నారని ఐఎల్వో రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటును పరిగణనలోకి తీసుకుంటే, మన దేశం 25 శాతంతో అధ్వాన స్థితిలో ఉందని తెలిపింది. అయితే, కరోనా సమయంలో మహిళల్లో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు మెరుగుపడిందని చెప్పింది. దేశ నిరుద్యోగం రేటు ప్రపంచ స్థాయి కంటే ఎక్కువగా ఉందన్న నివేదిక..గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. దేశంలోని యువకుల నైపుణ్యాలకు, మార్కెట్లో ఉద్యోగాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే గ్రాడ్యుయేట్ల అన్ఎంప్లాయిమెంట్ రేటు పెరుగుదలకు కారణమని ఐఎల్వో రిపోర్ట్ వెల్లడించింది.