- పరిశోధనలు ముమ్మరం చేయాలి
- రైతులను కూరగాయల సాగు వాలంటీర్లుగా తీర్చిదిద్దాలి
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా చేపట్టిన ముమ్మర పరిశోధనలు, ఆధునిక ఆవిష్కరణలతో కూరగాయల పంటల్లో అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో హార్టికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ‘కూరగాయల పంటలపై అఖిల భారత సమన్వయ పథకం’ 44వ వార్షిక సమావేశం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అగ్రికల్చర్ సెక్రటరీ కె.సురేంద్ర మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూరగాయల కొరతను పరిష్కరించేందుకు 908కు పైగా ప్యాక్స్ సంఘాల ఆధ్వర్యంలో 800కు పైగా రైతులను ‘కూరగాయల సాగు వాలంటీర్లు’ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. వారితో ఇతర రైతులకు శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు అందుబాటులో మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొస్తామని, దేశవ్యాప్తంగా ఉత్తమ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తామని పేర్కొన్నారు.
సమతుల్య ఎరువుల వాడకంతో నేలల్లో కార్బన్ శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుతం 0.3 శాతం మాత్రమే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే మాట్లాడుతూ.. హార్టికల్చర్ రంగం ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోందని, దీని విలువ రూ.7.60 లక్షల కోట్లుగా ఉందన్నారు. గత 12 ఏళ్లలో వీటి విస్తీర్ణం రెండింతలు పెరిగిందని, 2047 నాటికి 747 బిలియన్ డాలర్ల విలువతో వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.
ఆహార ధాన్యాల వినియోగం నెలకు 11 కిలోల నుంచి 9 కిలోలకు తగ్గాయని, హార్టికల్చర్ ఉత్పత్తుల వినియోగం 5 కిలోల నుంచి 9.7 కిలోలకు పెరిగిందని వెల్లడించారు. గతంలో 3 లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు ప్రస్తుతం లక్ష ఎకరాలకు పడిపోయిందని హార్టికల్చర్ వర్సిటీ వీసీ డా.దండా రాజిరెడ్డి అన్నారు. ఆ సాగును రెండింతలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
