డేంజర్‌‌‌‌‌‌‌‌గా హైవే 765డీ...హైదరాబాద్‌‌‌‌– మెదక్‌‌‌‌ హైవేపై నిత్యం ప్రమాదాలే

డేంజర్‌‌‌‌‌‌‌‌గా హైవే 765డీ...హైదరాబాద్‌‌‌‌– మెదక్‌‌‌‌ హైవేపై నిత్యం ప్రమాదాలే
  •     డివైడర్ లేకపోవడం, ఎక్కువ టర్నింగ్‌‌‌‌లు, టూలేన్‌‌‌‌ వల్లే ప్రమాదాలు
  •     ఏటా 50 మందికి పైగా మరణాలు
  •     రోడ్డు విస్తరణతోనే  ప్రమాదాలకు చెక్‌‌‌‌ 

మెదక్, వెలుగు: హైదరాబాద్– మెదక్– బోధన్‌‌‌‌ వరకున్న నేషనల్ హైవే 765 డీ యమడేంజర్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఇది హైవే అయినప్పటికీ టూ లేన్ మాత్రమే ఉండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంది. దీంతోపాటు డివైడర్ లేకపోవడంతో, ఎక్కువ టర్నింగ్‌‌‌‌లు ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిఏటా 50 మందికిపైగా చనిపోతున్నారు. రోడ్డు విస్తరణతోనే ప్రమాదాలను నివారించొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

2018లో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌గా అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ 

గతంలో ఇది స్టేట్ హైవేగా సింగిల్ లేన్‌‌‌‌గా ఉండగా వాహనాల రద్దీ పెరగడంతో 2018లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేగా అప్‌‌‌‌గ్రేడ్ చేసింది. రూ.320కోట్లతో పనులు చేపట్టి 2021లో పూర్తిచేశారు. రోడ్డును భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా నిర్మించినప్పటికి టూ లేన్‌‌‌‌గా నిర్మించడమే సమస్యగా మారింది. ఈ మార్గం గుండా నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, మెదక్, నర్సాపూర్, జీడిమెట్ల, సిద్దిపేట, సంగారెడ్డికి రాకపోకలు సాగిస్తుంటాయి. హైవేగా అప్ గ్రేడ్ చేసి రోడ్డు బాగైన తరువాత ఈ రూట్లో ప్రైవేట్ వెహికల్స్ రాకపోకలు పెరిగాయి. ఇదివరకు మెదక్ నుంచి చేగుంట, తూప్రాన్ రూట్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ వెళ్లేవారు ఇపుడు వయా నర్పాపూర్ మీదుగా వెళ్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలైన ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్ సందర్శనకు వచ్చే వారు ఈ రూట్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో బాలానగర్ నుంచి మెదక్ వరకు ఈ హైవే మీద వాహనాల రద్దీ  అధికంగా ఉంటోంది. 

డివైడర్ లేనిచోట, టర్నింగ్‌‌‌‌ల వద్ద..

కాగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని గుమ్మడిదల, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణ పరిధిలో, కౌడిపల్లి మండలం వెంకట్రావ్ పేట, మండల కేంద్రమైన కౌడిపల్లి, కొల్చారం,   అప్పాజిపల్లి, పోతంశెట్టిపల్లి,  మెదక్ మండలం మంబోజిపల్లి వద్ద కొంతదూరం మాత్రమే ఫోర్‌‌‌‌‌‌‌‌ లేన్‌‌‌‌ రోడ్డు నిర్మించి మధ్యలో డివైడర్ ఏర్పాటుచేశారు. ఈ రోడ్డుపై డివైడర్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో తరచూగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కొల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్, హనుమాన్ బండల్,  కొల్చారం జైన్ మందిర్, లోతువాగు, కౌడిపల్లి మండలం ధర్మాసాగర్, నాగ్సాన్​పల్లి, రాయిలాపూర్, తునికి గేట్,  నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. 

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నుంచి మెదక్ జిల్లాలోని నర్సాపూర్  పట్టణం వరకు 14  కిలోమీటర్ల దూరం రోడ్డు వంపులు తిరిగి ఉంటుంది. హైవేగా అప్ గ్రేడ్ చేసే సమయంలో ఈ రోడ్డును సరిచేసి విస్తరించాల్సి ఉన్నా  ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతి రాకపోవడంతో టూ లేన్‌‌‌‌గానే నిర్మించారు. గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు మూలమలుపులన్నీ అలాగే ఉన్నాయి.  రోడ్డు బాగుండటంతో వాహనాలు చాలా స్పీడ్ గా వస్తుండగా, టర్నింగ్‌‌‌‌ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.

హైవే రోడ్డును మొత్తం ఫోర్‌‌‌‌‌‌‌‌ లేన్‌‌‌‌గా విస్తరించడంతోపాటు, గుమ్మడిదల-– నర్సాపూర్ మధ్యలో టర్నింగ్‌‌‌‌లను తొలగించి, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి. ఈ రోడ్డును మెదక్ నుంచి నర్సాపూర్ వరకు ఫోర్ లేన్‌‌‌‌గా విస్తరించడంతోపాటు, నర్సాపూర్-–గుమ్మడిదల మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయిస్తున్నట్టు మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌రావు పలుమార్లు తెలిపారు. అయితే ఈ హామీ అమలుకు నోచుకోవడం లేదు. 

ఏటా50 మందికి పైగా..

765డీ హైవే మీద ప్రమాదాలతో ప్రతి ఏటా 50  మంది వరకు చనిపోతున్నారు. గత మార్చి నెల 14న కొల్చారం మండలం రాంపూర్ వద్ద బైక్– ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. అదే నెల 18న రాత్రి పోతంశెట్‌‌‌‌పల్లి శివారు హనుమాన్ బండల్ వద్ద కారు, ఆటో ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత కొద్ది రోజులకు కొల్చారం శివారులో హైదరాబాద్ నుంచి మెదక్ వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన అవతలి వైపు ఉన్న చెట్టును ఢీకొని మెదక్ పట్టణానికి చెందిన వ్యాపారి రోహిత్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

రెండు రోజుల కింద ఆదివారం రాత్రి కౌడిపల్లి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదాలకు డివైడర్ లేకపోవడమే  ప్రధాన కారణం. గతేడాది కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌‌‌‌‌‌‌‌–వెంకట్రావ్‌‌‌‌పేట మధ్యలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా.. నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట వద్ద రెండు బైక్ లు, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.