గువాహటి: అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. మే 12న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గం కూడా అదేరోజు కొలువుదీరనుంది. ఆదివారం జరిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే శాసనసభాపక్ష నేతల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించారు.
ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు హిమంత పేరును ప్రతిపాదించగా, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం హిమంత బిశ్వ శర్మ రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అంతకుముందు శనివారం బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన జేపీ నడ్డా, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీతో ఆయన భేటీ అయ్యారు. అస్సాం అసెంబ్లీలో 126 సీట్లుండగా ఎన్డీయే కూటమి మూండింట రెండొంతుల మెజార్టీతో వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 82 స్థానాలను గెలుచుకోగా, దాని మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) చెరో 10 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో కూటమి బలం 102కు చేరుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్కును దాటింది. హిమంత బిశ్వ శర్మ 2015లో బీజేపీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండేవారు. దివంగత మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి ఆ పార్టీని ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.
