హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని కొండాపూర్‌లో ఉన్న ప్రముఖ జాయకా ఫుడ్ కోర్ట్ (Zaika Food Court) లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఫుడ్ కోర్టులో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయంటూ ఓ కస్టమర్ ఆధారాలతో సహా వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేయడంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
రెస్టారెంట్ లోపల ఎలుకల సంచారం విపరీతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, కస్టమర్లకు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంచిన ఫుడ్ ప్యాకెట్లను ఎలుకలు కొరికినట్లు, ఫుడ్ ఐటమ్స్,ప్యాకేజింగ్ మెటీరియల్ నిల్వ ఉంచే ప్రాంతాల్లో ఎలుకల విసర్జనలు (రెట్టలు) పడి ఉన్నట్లు అధికారులు కళ్లారా చూశారు.
ఇక కిచెన్ లోని ఫ్రీజర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కనీసం పనిచేయని ఫ్రీజర్‌లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచడమే కాకుండా... పూర్తిగా పాడైపోయిన చికెన్ బిర్యానీ, కుళ్ళిపోయిన కూరగాయలను అందులో దాచి ఉంచినట్లు తనిఖీల్లో తేలింది. వంటగది పరిసరాలు మొత్తం తీవ్ర అపరిశుభ్రంగా, దుర్వాసనతో నిండి ఉన్నాయి.
►ALSO READ | సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు
కనీసం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కానీ, పెస్ట్ కంట్రోల్ చేసిన రికార్డులు కానీ యాజమాన్యం దగ్గర అందుబాటులో లేవు. ప్రజల ఆరోగ్యంతో ఇంతలా చెలగాటమాడుతున్న జాయకా ఫుడ్ కోర్ట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. తీవ్రమైన ఉల్లంఘనలు ఉన్నందున ఆ ఫుడ్ కోర్టు లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, హోటల్‌ను పూర్తిగా సీజ్ చేశారు.
