
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో అద్భుత విజయాలతో హోరెత్తించిన ఇండియా హాకీ జట్టు.. ఆసియా కప్ సూపర్–4 స్టేజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. బుధవారం డిఫెండింగ్ చాంపియన్ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను 2–2తో డ్రా చేసుకుంది. 8వ నిమిషంలోనే హార్దిక్ సింగ్ గోల్ కొట్టి ఇండియాను ఆధిక్యంలో నిలిపాడు.
కానీ కొరియా ప్లేయర్లు యాంగ్ జిహున్ (12వ ని), హియోన్‌హంగ్ కిమ్ (14వ ని) రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టారు. అయితే చివరి క్వార్టర్‌లో మణ్‌దీప్ సింగ్ (52వ ని) గోల్ సాధించడంతో ఇండియా ఓటమి తప్పించుకుంది.
రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు కావడంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించలేదు. ఆట ఆరంభం నుంచి అవకాశాలను సృష్టించుకోవడంలో ఇండియా ఫార్వర్డ్స్ ఫెయిలయ్యారు. ఫలితంగా కొరియా డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు.
స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిన కొరియన్లు వీలైనప్పుడల్లా ఇండియా సర్కిల్‌లోకి చొచ్చుకొచ్చారు. అయితే డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో గోల్స్ అవకాశాలను ఇవ్వలేదు. గురువారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. మలేసియాతో తలపడుతుంది. సూపర్–4 రౌండ్ ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ 2–0తో చైనీస్‌తైపీపై గెలవగా.. మలేసియా 2–0తో చైనాపై విజయం సాధించింది.