రంగుల పండుగ వచ్చేసింది. హోలీ పండుగరోజు పొద్దున లేచి, హోలీ ఆడుకొని, అమ్మ చేసిన పిండి వంటలు తినడం మామూలే. అయితే, ఈ సారి కొంచం కొత్తగా, వెరైటీగా ఉండేందుకు మన ఆల్ టైం ఫేవరెట్ పకోడాని ట్రై చేద్దాం. వీటిని పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ఆలూ పనీర్ పకోడా:
కావాల్సినవి: 5 పనీర్ ముక్కలు, ఉడకబెట్టిన ఆలూ, అర కప్పు నల్ల మిరియాలు, ఉప్పు తగినంత, 3 టేబుల్ స్పూన్ శనగ పిండి, నీళ్లు
తయారీ: పనీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఆలూని నలిపి అందులో కారం, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని వేసి అన్నింటినీ మరొకసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పక్కన పెట్టుకొని శనగ పిండిని కలుపుకోవాలి. ఆలూ, పనీర్ మిశ్రమాన్ని శనగపిండిలో ముంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుంటే.. అలూ పనీర్ పకోడా రెడీ.
చీజ్ పకోడా:
కావాల్సినవి: నల్ల మిరియాలు పావు టీ స్పూన్, అరకప్పు శనగపిండి, చిటికెడు పసుపు,చిటికెడు బేకింగ్ సోడా, అర టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ నువ్వులు, ఉప్పు రుచికి తగినంత, నీళ్లు, 5 చీజ్ ముక్కలు
తయారీ: శనగపిండిలో మిరియాల పొడి, బేకింగ్ సోడా, పసుపు, కారం, ఉప్పు, నీళ్లు పోసి కలుపుకోవాలి. అందులో చీజ్ ముక్కల్ని వేసి ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ వేగించుకోవాలి. వీటిని టమాటా కెచప్ తో నంజుకొని తింటే టేస్ట్ బాగుంటుంది.
తందూరి పకోడా:
కావాల్సినవి: 200 గ్రా. పనీర్, 4 కప్పుల పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక కప్పు శనగ పిండి, అర టీస్పూన్ కొత్తిమీర పౌడర్, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ తందూరీ మసాలా,ఉప్పు, కారం రుచికి తగినంత, చిటికెడు బేకింగ్ సోడా
తయారీ: పనీర్ ని చిన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిపై నిమ్మ రసం, కొత్తిమీర పౌడర్, పసుపు, జీలకర్ర పొడి, తందూరీ మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత శనగ పిండి ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. కలుపుకొనున్న పనీర్ ని శనగ పిండిలో వేసి డీప్ ఫ్రే చేసుకోవాలి. అంతే వేడి వేడి తందూరి పకోడా రెడీ.
