ఉంటున్నరా..? అద్దెకిచ్చారా..? హైదరాబాద్‎లో డబుల్ ఇండ్లపై సర్వే.. లబ్ధిదారుడు లేకపోతే ఇళ్లు రద్దు

ఉంటున్నరా..? అద్దెకిచ్చారా..? హైదరాబాద్‎లో డబుల్ ఇండ్లపై సర్వే.. లబ్ధిదారుడు లేకపోతే ఇళ్లు రద్దు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై హౌసింగ్ అధికారులు సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇండ్లను అందుకున్న లబ్ధిదారులు అందులో ఉంటున్నారా..? అద్దెకు ఇచ్చారా..? ఉండకుండా తాళం వేసి ఉంచారా..?  లబ్ధిదారుడు కాకుండా బంధువులు, రక్త సంబంధీకులు ఉంటున్నారా..? ఇంటిని ఎవరికైనా అమ్మారా..? వంటి ప్రశ్నలతో  ‘హౌసింగ్  కాలరీస్  ఇన్ స్పెక్షన్’ యాప్ లో వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో సర్వే కొనసాగుతోంది.

ఈ నెలాఖరుకు అన్ని జిల్లాల్లో సర్వే ప్రారంభించనున్నారు. వచ్చె నెలలో సర్వే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో లబ్ధిదారుడు ఉంటే ఆ వ్యక్తి ఫొటో, ఇంటి ఫోటో, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ను యాప్ లో అప్ లోడ్  చేస్తున్నారు. అద్దెకు ఇస్తే ఎప్పటినుంచి అద్దెకిచ్చారు, ఎవరు ఉంటున్నారు, వారి వివరాలు, ఎంత రెంట్ వసూలు చేస్తున్నారు వంటి వివరాలు రికార్డు చేస్తున్నారు. 

గత బీఆర్ఎస్  ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎంసీలో లక్ష, ఇతర జిల్లాలకు 1.72 లక్షల ఇండ్లను (మొత్తం 2.72 లక్షలు) మంజూరు చేసింది. అందులో  1.58 లక్షల ఇళ్లను పూర్తిచేసి 1.36  లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఇందులో జీహెచ్ఎంసీలో 55 వేల ఇళ్లు ఉన్నాయి. రెండు నెలల క్రితం  ‘హౌసింగ్  కాలరీస్  ఇన్ స్పెక్షన్’ యాప్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఉప్పల్, చెంగిచెర్లలో ఉన్న డబుల్ ఇళ్లలో అధికారులు సర్వే చేసి యాప్ ను సక్సెస్  చేశారు. 

 ఈ యాప్ ను సెంటర్  ఫర్  గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) రూపొందించింది. హౌసింగ్  కార్పొరేషన్  అధికారులు, జీహెచ్ఎంసీ, సంగారెడ్డి మున్సిపల్  వార్డు ఆఫీసర్లు కలిసి సర్వే చేస్తున్నారు. మంగళవారం నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 55 వేల ఇండ్లకు 35 వేల ఇళ్లలో సర్వే పూర్తయిందని  తెలిపారు. ఈ వారంలో జీహెచ్ఎంసీలో పూర్తి చేసి దసరా తరువాత  ఇతర జిల్లాల్లో   చేస్తామని చెప్పారు.

లబ్ధిదారుడు లేకపోతే ఇళ్లు రద్దు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారుడు లేకుండా అద్దెకిస్తే ఇళ్లు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తయ్యాక రిపోర్ట్ ను సీఎం రేవంత్  రెడ్డి, హౌసింగ్ మంత్రికి అందజేయనున్నారు. ఇళ్లలో ఉండని వారికి నోటీసులు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

కొల్లూరులో వసతుల కల్పన

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరులో ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని 142 ఎకరాల్లో రూ.1489 కోట్ల వ్యయంతో 117 బ్లాకుల్లో 15,660 డబుల్  ఇండ్లను గత ప్రభుత్వం నిర్మించింది. వీటిని 2023 జూన్ 22 న అప్పటి సీఎం  కేసీఆర్  ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.

 ఆసియా ఖండంలోనే అతి పెద్ద హౌసింగ్ కాలనీగా ఇది గుర్తింపు పొందింది.  అయితే ఇక్కడ మౌలిక వసతులు లేవని చాలా మంది ఆ ఇళ్లకు తాళాలు వేసి ఉంచారు. కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కడ వసతులను కల్పించింది. ఇందులో సర్వే చేయగా 9 వేల మంది ఉంటుండగా మిగతా ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.