గడువున్న కాంట్రాక్టును ఎట్ల రద్దు చేస్తరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

గడువున్న కాంట్రాక్టును ఎట్ల రద్దు చేస్తరు?  ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్ ఫుడ్ కాంట్రాక్టర్‌‌కు 2021 సెప్టెంబర్‌‌ ఆఖరు వరకు గడువు ఉన్నప్పటికీ, మధ్యలో ఎలా రద్దు చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాంట్రాక్టర్ సురేశ్ ఫైల్ చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయసేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌.. సర్కార్ ఉత్తర్వులను రద్దు చేసింది. కాంట్రాక్టర్ తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చని, అయితే నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉండాలంది.

గడువు ఉండడంతో గాంధీలో కాంట్రాక్టు కొనసాగించాలని, గడువు పూర్తయినందున చెస్ట్ ఆస్పత్రికి ఫుడ్ కాంట్రాక్టు కోసం మరో నోటిఫికేషన్ ఇవ్వొచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. నిలోఫర్ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్‌‌ అక్రమాలకు పాల్పడుతున్నాడని డాక్టర్‌‌ పి.భగవంత్‌‌రావు గతంలో పిల్‌‌ ఫైల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఆహారంలో పుల్లలు, దారం వంటివి కూడా వస్తుంటే కాంట్రాక్టర్‌‌ను ఎలా కొనసాగిస్తారని అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో మూడు ఆస్పత్రుల్లోనూ కాంట్రాక్టును రద్దు చేయడంతో సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు.  తదుపరి విచారణను నవంబర్‌‌ 5కు వాయిదా వేసింది.