బిర్యానీ అనగానే టక్కున గుర్తొచ్చేది ఇండియానే.. ఇప్పుడు ఆ లిస్టులోకి మరి కొన్ని దేశాలు చేరుతున్నాయి. మన దేశం నుంచి వలస వెళ్లిన కొందరు ఆయా దేశాల్లో మన వంటకాల రుచిని అక్కడి పౌరులకు రుచి చూపిస్తున్నారు. అలా దక్షిణ భారత దేశం నుంచి 50 ఏళ్ల క్రితం సింగపూర్ కి వలస వెళ్లిన ఓ కుటుంబం ఏకంగా అక్కడి వాసులకు బిర్యానీ ఇష్టంగా తినేలా చేసింది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి మూడో తరం వాసులు అక్కడ చెఫ్‌లుగా ఉన్నారు. సయ్యద్ కాసిమ్ తమిళనాడులోని రామనాథన్ పురం నుంచి వలస వచ్చిన వారిలో ఉన్నారు. అక్కడ ఇండియన్ రోజాక్ పేరుతో ఇండియన్ వెరైటీస్ రుచి చూపిస్తున్నారు. ఇది 23 రకాల వెజిటేబుల్స్, మీట్ బాల్స్ తో తయారు చేసిన మిశ్రమం.
వీటిని వేరుశనగ పిండి, చింతపండుతో చేసిన గ్రేవీతో తింటారు. 38 ఏళ్ల సగుబర్సాదిక్ అదే దేశంలో ఇండియా ఫుడ్ అవుట్‌లెట్‌ను కొనసాగిస్తున్న మూడో తరం వారసుడు. లక్సా, చికెన్‌రైస్, హక్కీన్ మీ, చార్క్వాయ్ టియో లాంటి సంప్రదాయ ఆహారాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాడు. హాకర్, ఫుడ్ సెంటర్ల ప్రత్యేకతను చాటి చెప్పడానికి ఆ దేశం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ దేశానికి చెందిన రైసెన్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది సింగపూర్ హాకర్ సెంటర్‌ను రక్షించడం ముఖ్యమని భావించారు.
