భద్రాచలం, వెలుగు : వీకెండ్ వేళ భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిగింది. భక్తులు అభిషేకంలో పాల్గొని అభిషేక జలాలను అందుకున్నారు.
తర్వాత బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం నిర్వహించారు. మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. యోగానంద లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యోగానందలక్ష్మీనర్సింహస్వామికి రథోత్సవం రాత్రి కన్నుల పండువగా సాగింది.
