సీతారామ ప్రాజెక్ట్ తో ఎత్తి ఎక్కడ పోసుడు ?రెండేండ్లు దాటినా ముందుకు సాగని ప్రపోజల్స్

సీతారామ ప్రాజెక్ట్ తో ఎత్తి  ఎక్కడ పోసుడు ?రెండేండ్లు దాటినా ముందుకు సాగని ప్రపోజల్స్
  •  రూ.20 వేల కోట్ల అంచనాతో కడుతున్న ప్రాజెక్ట్ పరిధిలో కనిపించని రిజర్వాయర్
  • సాగర్ పరిధిలోని ఐదు టీఎంసీల కెపాసిటీ గల మూడు రిజర్వాయర్లే దిక్కు
  • రూ.6,500 కోట్లతో చిలక్కోయలపాడు వద్ద 20 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ ప్రతిపాదన

వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖమ్మం జిల్లాలో కడుతున్న సీతారామ ప్రాజెక్ట్ నుంచి ఎత్తే నీటిని ఎక్కడ పోస్తారో అంతుచిక్కడం లేదు. ప్రాజెక్ట్ పరిధిలో నిర్మించేందుకు బీఆర్ ఎస్ ప్రతిపాదించిన రిజర్వాయర్లన్నీ వివిధ కారణాలతో పక్కకు పోగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన ప్రపోజల్స్ సైతం కాగితాలకే పరిమితం అయ్యాయి.

 ప్రస్తుతం పాలేరు, వైరా, లంకాసాగర్​రిజర్వాయర్లను కలుపుకొని కేవలం ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశమే ఉంది. చిలక్కోయలపాడు సమీపంలోని రిజర్వాయర్ నిర్మించాలని ప్రపోజల్స్ రెడీ చేసినా.. ఆ పనులు రెండేండ్లుగా ముందుకుసాగడం లేదు.

 ఖమ్మం, వెలుగు :  రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ.. ఈ మూడు ఎత్తిపోతల పథకాలు బీఆర్ ఎస్ హయాంలో రీడిజైన్ చేసినవే. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నవి, పెద్దవి కలిపి 15 రిజర్వాయర్లను నిర్మించగా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. కానీ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్​ చేసి రూ. 20 వేల కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టులో మాత్రం ఒక్క రిజర్వాయర్ ను కూడా నిర్మించలేదు.

 ప్రాజెక్ట్ ను రీ డిజైన్​చేసిన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం దగ్గర రిజర్వాయర్​నిర్మిస్తామని, అప్పటికే ఉన్న రోళ్లపాడు, బయ్యారం చెరువు, పాలవాగును రిజర్వాయర్లుగా అభివృద్ధి చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్​ రోళ్లపాడు దగ్గరే శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత చేసిన మార్పులు, చేర్పుల్లో రిజర్వాయర్లన్నీ సైడ్ అయ్యాయి. 

కిన్నెరసాని అభయారణ్యం, కేటీపీఎస్, రైల్వే లైన్​చిక్కుల వంటి సాంకేతిక కారణాలతో పాటు సాగు భూమి తక్కువగా ఉందన్న కారణాలను చూపిస్తూ రిజర్వాయర్లను పక్కనపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్​నిర్మాణానికి ప్రపోజల్స్ సిద్ధం చేసినా అవీ కాగితాలకే పరిమితమయ్యాయి.

సీఎం ప్రకటించినా...

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు ప్రాజెక్టును సందర్శించారు. బీఆర్​ఎస్​హయాంలో రూ.7,500 కోట్లు ఖర్చు చేసినా, టెయిల్ వర్క్స్ చేసుకుంటూ, హెడ్ వర్క్స్​ ను పట్టించుకోలేదని తేల్చారు. పూర్తి అయిన మూడు పంప్​హౌజ్​లను ఉపయోగంలోకి తెస్తూ, వైరా రిజర్వాయర్​కు గోదావరి నీళ్లు తెచ్చేందుకు రూ.100 కోట్లతో ఏన్కూరు లింక్​ కెనాల్ ను పూర్తి చేసి చేసి2024 ఆగస్ట్ 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంలోనే సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్​నిర్మాణంతో పాటు, మున్నేరు నుంచి గ్రావిటీ కెనాల్ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చేసిన ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

 కురవి వీరభద్రుడి పేరుమీద డోర్నకల్​నియోజకవర్గంలో రిజర్వాయర్​ నిర్మాణాన్ని పొంగులేటి తన దృష్టికి తెచ్చారని, మున్నేరు నుంచి 32 టీఎంసీల నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా ఉపయోగించుకోవడంపైనా స్టడీ చేయిస్తానని వైరా బహిరంగ సభలో సీఎం ప్రకటించారు. మున్నేరు, పాలేరు లింక్​కెనాల్ భూసేకరణ పనులు ప్రస్తుతం జరుగుతుండగా, రిజర్వాయర్​నిర్మాణ ప్రతిపాదన మాత్రం ముందుకు పడలేదు. 

ముందుకు సాగని చిలక్కోయలపాడు రిజర్వాయర్

మహబూబాబాద్​జిల్లా డోర్నకల్, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మీదుగా మున్నేరు, ఆకేరు వాగులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు వాగులకు మధ్యలో చిలక్కోయలపాడు సమీపంలో రిజర్వాయర్ ను ప్లాన్ చేశారు. 20 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్ కు 4,200 ఎకరాలు అవసం అవుతాయని అంచనా వేయగా.. ఇందులో 2 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములే ఉన్నాయి. 

మిగిలిన పట్టా భూముల్లో కూడా సాగు చేయని మట్టి గుట్టలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల్లో జీఎస్టీ పన్నులు, భూసేకరణ ఖర్చు కలుపుకొని సుమారు రూ.6,500 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేయడంతో రెండేండ్లుగా ప్రతిపాదనల దశ నుంచి ముందుకుపోవడం లేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే, గుట్టలను కలుపుకుంటూ 14 కిలోమీటర్ల బండ్​నిర్మించడం ద్వారా 15 నెలల్లోనే రిజర్వాయర్​నిర్మించొచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. దీని నిర్మాణం​ పూర్తయితే డోర్నకల్, పాలేరు నియోజకవర్గాలతో పాటు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గానికి కూడా కృష్ణా​నీటితో సంబంధం లేకుండా సాగునీరందించే అవకాశం ఉంటుంది. 

పాలేరు రిజర్వాయర్​నుంచి మళ్లీ సాగర్​కాల్వలను ఉపయోగించుకుంటూ వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని రెండున్నర లక్షల ఎకరాల సాగర్​ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టుకు కూడా పాలేరు, వైరా, లంకాసాగర్​ రిజర్వాయర్లు కలుపుకొని కేవలం 5 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంది. అదే కొత్త రిజర్వాయర్​ అందుబాటులోకి వస్తే 20 టీఎంసీలను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.

గ్రావిటీ ద్వారా  మున్నేరు నీటి వినియోగం..!

 ప్రతిపాదిత కొత్త రిజర్వాయర్​కు సీతారామ కాల్వల ద్వారా నీళ్లు రావడంలో ఆలస్యం జరిగినా, గ్రావిటీ ద్వారా మున్నేరు నీటిని ఉపయోగించుకునేలా ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా మున్నేరు ద్వారా 30 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోంది. ప్రస్తుతం సీతారామ కాల్వలు ఆలస్యం అవుతుండడంతో పాటు, ప్రతిసారి ఎత్తిపోతలకు విద్యుత్​ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మున్నేరు నీటిని కొత్త రిజర్వాయర్​తో పాటు, పాలేరు రిజర్వాయర్ కు తరలించేలా ప్లాన్ చేశారు.

 కాల్వలకు రూ.110 కోట్లు, ల్యాండ్ అక్విజేషన్​కు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.140 కోట్ల అంచనా వ్యయంతో 9.6 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వడం ద్వారా మున్నేరు నీటిని ప్రస్తుతం నిర్మాణమవుతున్న పాలేరు ట్రంక్​ కెనాల్​కు తరలించే విధంగా పనులు జరుగుతున్నాయి. 

మహబూబాబాద్​జిల్లా గార్ల మండలం మద్దివంచ పరిధిలోని దుబ్బగూడెం దగ్గర మున్నేరుపై చెక్​డ్యామ్​ ఉంది. అక్కడి నుంచి 9.6 కిలోమీటర్ల దూరంలోని గార్ల దగ్గర పాలేరు లింక్​కెనాల్​నాలుగు మీటర్ల దిగువన ఉంది. దీంతో గ్రావిటీ ద్వారానే పైసా ఖర్చు లేకుండా పాలేరు కాల్వలోకి మున్నేరు నీటిని తరలించొచ్చు. ఆ కాల్వల ద్వారా కొత్త రిజర్వాయర్​కు, పాలేరు రిజర్వాయర్ కు నీటిని తరలించనున్నారు.