V6 News

విదేశీ ఉద్యోగాలకు యువతను సిద్ధం చేయాలి.. జర్మనీలో భారీగా ఉపాధి అవకాశాలు: మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకట స్వామి

విదేశీ ఉద్యోగాలకు యువతను సిద్ధం చేయాలి.. జర్మనీలో భారీగా ఉపాధి అవకాశాలు: మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకట స్వామి
  • వాటిని అందిపుచ్చుకునేలా వృత్తి, భాషా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
  • అవసరమైన ట్యూటర్లను పెట్టి శిక్షణ అందించాలి
  • టామ్ కామ్ బోర్డు సమావేశంలో అధికారులకు ఆదేశాలు
  • సంస్థ పని తీరు, సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచన

హైదరాబాద్/బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో చదువుకున్న యువతలో విదేశీ ఉపాధిపై ఆసక్తి పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. ముఖ్యంగా జర్మనీకి అవసరమైన నైపుణ్యాలు, ఆ దేశ భాషలో ప్రావీణ్యం సంపాదించేందుకు పెద్ద సంఖ్యలో యువతను శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపాలని సూచించారు. 

సక్సెస్ ఫుల్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇతర యువతను కూడా విదేశీ ఉద్యోగాల వైపు ఆకర్షిస్తాయన్నారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ఓవర్సీస్ మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్ కంపెనీ (టామ్ కామ్) బోర్డు సమావేశం జరిగింది. ఇందులో విదేశీ ఉపాధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. కేపాసిటీ బిల్డింగ్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ‘ట్రైనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శిక్షణ’ (ట్రైనింగ్ ది ట్రైనర్స్) అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు.

భాషా బోధన కోసం నైపుణ్యం కలిగిన ట్రైనర్లను నియమించాలని, ప్రధానంగా జర్మన్ భాష శిక్షణను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. జర్మనీలో నైపుణ్య కార్మికులు, చదువుకున్న యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలను తెలంగాణ యువత వినియోగించుకునేలా టామ్ కామ్ చురుగ్గా పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను అందించే విశ్వసనీయ అధికారిక సంస్థ టామ్ కామ్ అని ఆయన స్పష్టం చేశారు.

జీసీసీ దేశాల్లో కార్మికుల నియామకాలపై జరుగుతున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. విదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి నిరంతరం అభిప్రాయాలను సేకరించి, నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి దేశానికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుందని, ఆ దేశాల సంస్కృతిపై కూడా యువతకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. టామ్​కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శిక్షణ నియామకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

టామ్ కామ్ పనితీరును, సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చాలని, విదేశీ ఉపాధి కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి ఉపాధి అవకాశాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఈ సమావేశంలో కార్మిక శాఖ సెక్రటరీ హరిచందన, లేబర్ కమిషనర్ పమేలా సత్పతి, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ కాంతి వెస్లీతో పాటు టామ్ కామ్, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

గోవును జాతీయ జంతువుగా గుర్తించాలి
గోవును జాతీయ జంతువుగా గుర్తించేలా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గో ఆరాధన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్మత్ పటేల్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోవధ నిషేధ చట్టం పకడ్బందీగా అమలుకు, గో రక్షణ కోసం జస్మత్ పటేల్ చేస్తున్న సేవలను కొనియాడారు. 

గోరక్షణ కోసం సీఎం నిధులు విడుదల చేశారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామిని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అలాగే, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్, గో వాత్స్ ఫౌండేషన్ సంయుక్తంగా గోసేవా సంస్థల ప్రతినిధి బృందం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కార్యకలాపాలపై వివరించారు. 

ఈ సమావేశంలో గోవుల సంరక్షణ, జంతు సంక్షేమం, గోశాలల అభివృద్ధి, సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహంపై చేపడుతున్న కార్యక్రమాలను గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించి, ప్రభుత్వ సహకారం కోరారు. ఈ సందర్భంగా గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. 

‘రోజుకు ఒక రూపాయి విరాళం’ పథకం ద్వారా చిన్న మొత్తాల సాయంతో గోసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్టీలు తెలిపారు. గత 14 ఏండ్లలో సుమారు 22 గోశాలలకు రూ.19 కోట్లకు పైగా సహాయం అందించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. కోవిడ్ సమయంలో కూడా పశుగ్రాసం, మందులు సరఫరా చేశామన్నారు. వారి సేవలను గవర్నర్ అభినందించారు.