తిరుమలకు పోటెత్తిన భక్తులు... ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటలు...

తిరుమలకు పోటెత్తిన భక్తులు... ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటలు...

కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. వేసవి సెలవులు, లాంగ్ వీకెండ్ కూడా రావడంతో భారీగా తరలివస్తున్నారు భక్తులు. రెండు తెలుగు రాష్ట్రాలలో పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు క్యూకట్టారు విద్యార్థులు తల్లిదండ్రులు.  దీంతో అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి చెక్ పోస్ట్ నుండి గరుడ సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరాయి. సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు ఆలస్యమవుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

ఇదిలా ఉండగా... శ్రీవారి దర్శనానికి వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి 10 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. 

ఇక గురువారం ( ఏప్రిల్ 30 ) తిరుమల శ్రీవారిని 59 వేల186 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27వేల 244 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు వచ్చినట్లు తెలిపారు టిటిడి అధికారులు.