
ఆపదలో, అపాయంలో ఉండి.. ఆర్థిక అండదండలు లేని పేదలకోసం కేటాయించిన సీఎం రిలీఫ్ ఫండ్ ను.. నకిలీ పత్రాలు సృష్టించి సొంత ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు కొందరు. గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసిన పరపతితో డబ్బును తమ అకౌంట్లలోకి మళ్లించుకుని నిజమైన లబ్దిదారులకు చేరకుండా మింగేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన ఏడుగురు నిందితులను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.
జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి సహానిధి కింద మంజూరైన చెక్కులను గత ప్రభుత్వంలో మంత్రి దగ్గర పనిచేసిన జోగుల నరేష్ కుమార్ (42) అనే వ్యక్తి.. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బు నొక్కేశాడు. మొత్తం 230 మంది లబ్ధిదారులకు మంజూరై పంపిణీ కాని చెక్కులను ప్రభుత్వం మారిన తరువాత స్వాధీనం చేసు కున్నాడు. అందులో దాదాపు 19 మంది లబ్ధిదారుల చెక్కులను గుర్తించి లబ్ధిదారుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 5లోని SBU బ్యాంకులో వాటిని జమ చేశారు.
ఇలా దాదాపు రూ.8 లక్షల 71 వేలు కాజేసిన జోగుల నరేష్ పాటు బాలగోని వెంకటేష్, కోరలపాటి వంశీ, పులిపాక ఓంకార్ తదితరులు మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు .. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ లబ్ధిదారులుగా ఉండి చెక్కులను తమ ఖాతాలో వేసుకొని డబ్బులను విత్ డ్రా చేసుకున్న పొట్ల రవి(46), జనగామ నాగరాజు(40), మాటేటి భాస్కర్(33), ధర్మారం రాజు(50), కాంపల్లి సంతోష్(35), చిట్యాల లక్ష్మి(65), అసంపల్లి లక్ష్మిలను శుక్రవారం (సెప్టెంబర్ 19) అరెస్ట్ చేశారు. వీరందరిని రిమాండుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.