- సర్కార్‌కు హెచ్ యూజే విజ్ఞప్తి
ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి జాగా ఇవ్వాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల ఇండ్లస్థలాల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ కు హెచ్‌యూజే కృతజ్ఞతలు తెలిపింది. సిటీలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఏండ్లుగా ఇంటి జాగా కోసం ఎదురుచూస్తున్నారని, వారికి న్యాయం చేసేలా సీఎం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని నేతలు పేర్కొన్నారు.
జర్నలిస్టులంతా తమ వృత్తిధర్మాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో హెచ్ యూజే కమిటీ సమావేశం జరిగింది. జర్నలిస్టులకు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్ కోరారు.
ఈ సమావేశంలో హెచ్‌యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, ట్రెజరర్ బి.రాజశేఖర్, ఆఫీస్ బేరర్లు జీవన్ రెడ్డి, వంగాల రమేష్, క్రాంతి, ఎం.రమేష్, నర్సింహ, రవితేజ, కాలేబ్, వీరేశ్, తలారి శ్రీనివాస్, మాధవరెడ్డి, బాలు, బ్రహ్మానందం, శేఖర్, విజయ తదితరులు పాల్గొన్నారు.