- 90 నిమిషాల్లోనే కేటుగాడి అరెస్ట్
హుస్నాబాద్, వెలుగు: “పింఛన్ ఇప్పిస్తా... రా అవ్వా” అంటూ మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును ఓ కేటుగాడు కాజేశాడు. కాగా నిందితుడిని పోలీసులు కేవలం 90 నిమిషాల్లోనే పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్ బస్టాండ్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. కేసు వివరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం వెల్లడించారు. పట్టణానికి చెందిన అయిలేని లక్ష్మి అనే వృద్ధురాలు గురువారం తన ఇంటికి వెళ్తుండగా అల్లెపు కృష్ణ అనే వ్యక్తి ఆమెను రెడ్డి కాలనీలో అడ్డగించాడు. గాయత్రి బ్యాంకులో రూ.4 వేల పింఛన్ ఇస్తున్నారు.. వెంటనే రావాలన్నాడు. అతడి మాటలు నమ్మిన వృద్ధురాలు వెంట వెళ్లగా బస్టాండ్ వెనకాల జనం లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫొటో దిగాలని, మెడలోని గొలుసు తీసేయాలని చెప్పడంతో ఆమె తన పావు తక్కువ మూడు తులాల బంగారు గొలుసును అతడికి ఇవ్వడంతో వెంటనే పరారయ్యాడు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై లక్ష్మారెడ్డి వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకొని సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. నిందితుడి ముఖం స్పష్టంగా రికార్డయ్యింది. దీంతో పోలీసులు, సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగి బస్టాండ్ వద్దే కృష్ణను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు, మొబైల్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఫిర్యాదు అందిన గంటన్నరలోనే కేసును ఛేదించిన పోలీసులను సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు. నిందితుడిపై ఇప్పటికే 86 కేసులు ఉన్నాయని తెలిపారు.
