- రైతులకు అండగా ఉంటాం: కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులంతా సహకరించాలని సిద్ధిపేట కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్‌లో అక్కన్నపేట మండలం చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భూసేకరణ ప్రక్రియపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్కన్నపేట మండలంలో 124 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం ఆర్థికంగా డెవలప్ అవుతుందని చెప్పారు. భూమిని త్యాగం చేస్తున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యమైన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తామని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూ సేకరణకు సహకరించాలని కోరారు.
