కాంగ్రెస్ అంతరించిపోతున్న పార్టీ

కాంగ్రెస్ అంతరించిపోతున్న పార్టీ

కేసీఆర్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను మట్టికరిపించే అవకాశం హుజురాబాద్ ప్రజలకు దక్కిందని..ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలకు దక్కబోతోందని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో బండి సంజయ్ సంగ్రామ యాత్ర సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ గడ్డమీద బీజేపీ జెండా ఎగిరేవరకు అండగా ఉంటామని తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని..అర్జునుడికి పక్షి కన్ను కనపడినట్టు, తమకు కేసీఆర్ ను గద్దె దించడమే కనపడుతోందన్నారు. 

‘‘నేను కారులో వస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేశారు. మేము బీజేపీ వైపు చూస్తున్నాం అని చెప్పారు. 2014 కి ముందు కులం, మతం అనే సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడాం. మళ్ళీ ఇప్పుడు బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కొట్లాడుదాం అని చెప్పాడు అని ఈటల తెలిపారు. ఇనుప కంచెలు..పోలీసుల పహారాలో కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నాడని..ఆయన ఉంటే ప్రగతి భవన్  లేదంటే ఫామ్ హౌజ్లో అని విమర్శించారు. ఎవరిని కదిలించినా..ఒక్కటే నినాదం అని..కేసీఆర్ ను బొందపెట్టే నినాదమని అన్నారు. 

దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్..ఆ మాట తప్పి మోసం చేశాడని ఈటల రాజేందర్  ఆరోపించారు. కానీ మోడీ మాత్ర ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారని చెప్పారు. గిరిజనులపై లాఠీచార్జి చేస్తూ..ప్రభుత్వం వాళ్ళను హింసిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉందని..20వ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంతరించిపోతున్న పార్టీ అని విమర్శించారు.