V6 News

రూ.39 లక్షల హైబ్రీడ్ గంజాయి సీజ్... ముషీరాబాద్లో పాత నేరస్తుడు అరెస్ట్

రూ.39 లక్షల హైబ్రీడ్ గంజాయి సీజ్...  ముషీరాబాద్లో పాత నేరస్తుడు అరెస్ట్

ముషీరాబాద్, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా హైబ్రీడ్ గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్రాల్​కు చెందిన రోషన్ సింగ్ ప్రైవేటు ఉద్యోగి. మంగళవారం సికింద్రాబాద్ నామాలగుండు ప్రాంతంలో తన బైక్​పై గంజాయిని బ్యాగులో వేసుకుని వెళ్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.39 లక్షల విలువైన 1.311 కిలోల హైబ్రీడ్ గంజాయి (ఓజీ కుష్)తో పాటు బైక్​ స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ఇతనిపై గతంలో కార్ఖానా పోలీస్ స్టేషన్​లో కేసు ఉన్నట్లు ఇన్​స్పెక్టర్ డి.రామకృష్ణ తెలిపారు.

వికారాబాద్​లో 25 కిలోల గంజాయి

వికారాబాద్​: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 25.5 కిలోల గంజాయిని వికారాబాద్ రైల్వే స్టేషన్​లో ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని అనకాపల్లికి చెందిన అర్లి గోవింద, కర్రి రమణమ్మ, అర్లి లోవమ్మ కలిసి పల్నాడు ఎక్స్​ప్రెస్​లో గంజాయిని వికారాబాద్ తీసుకువచ్చారు. అక్కడ రైలు కోసం వేచి చూస్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న 12 బ్యాగుల్లో 25.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు.